ఆస్ట్రేలియాలో ఈ అక్టోబరులో ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఓ కొత్త ప్రతిపాదన చేశాడు. 2021లో టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సివుంది. దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తే ఆ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా (2020 ప్రపంచకప్)తో మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ ఏడాదే టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వొచ్చని గావస్కర్ అన్నాడు.
షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సివుంది.
"విదేశీయులు తమ దేశంలోకి రాకుండా ఆస్ట్రేలియా సెప్టెంబరు 30 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ అక్టోబరు మధ్యలో ఆరంభం కావాల్సివుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టం అనిపిస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగాల్సివుంది. మన దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తే ఆస్ట్రేలియాతో ప్రపంచకప్‌ను మార్చుకోవచ్చు. 2020 ప్రపంచకప్‌ను భారత్‌లో అక్టోబరు-నవంబరులో నిర్వహించవచ్చు. వచ్చే ఏడాది అదే సమయంలో ఆసీస్‌లో టోర్నీని ఆడించొచ్చు."
-సునీల్ గావస్కర్.