డ్రెస్సింగ్ రూం నుంచి సంకేతాలివ్వడం మ్యాచ్‌కు విరుద్ధం కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విశ్లేషకుడు నాథన్ లీమన్ సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.
"ప్లకార్డులు చూపాలనే విషయంపై మ్యాచ్ రిఫరీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దగ్గర అనుమతి తీసుకున్నాడా?. దీనికి ఐసీసీ అనుమతి ఇచ్చిందా అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. పాకిస్థాన్‌లో కూడా ఇలాంటి చర్యే జరిగిందని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌కు విశ్లేషకుడిగా ఉన్న ఆయనే అప్పుడు పాక్ జట్టుకూ విశ్లేషకుడిగా ఉన్నట్లు సమాచారం. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం బాధాకరం. రివ్యూ విషయంలోనూ ప్రస్తుతం ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్లకార్డుల ద్వారా.. రివ్యూ తీసుకునేందుకూ విశ్లేషకులు కెప్టెన్‌కు సంకేతాలు పంపే అవకాశముంది కదా ".
-సునీల్ గావస్కర్, భారత మాజీ కెప్టెన్.
మ్యాచ్ మధ్యలో ప్లకార్డుల ద్వారా సంకేతాలివ్వడంపై వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నాడు. ఇలాంటివి ఉపయోగించి మ్యాచ్ ఆడాలనుకుంటే జట్టుకు కెప్టెన్ అవసరంలేదని తెలిపాడు.
ఇదీ చదవండి:14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు సఫారీలు