ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భాగంగా జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నారు టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్. రెండో టీ20లో వీరిద్దరికీ ఆడే అవకాశం లభించింది. ఓపెనర్‌గా బరిలో దిగిన ఇషాన్ కిషన్ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయినా కూడా అతడిని మూడో టీ20 నుంచి తప్పించారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ గంభీర్.. కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
"కోహ్లీ నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు సరైనవి కావు. సూర్యకుమార్‌కు ఎలాంటి గాయాలు లేవు. అతడి బ్యాటింగ్ తీరు చూసిందీ లేదు. మరి అలాంటపుడు అతడిని ఎలా పక్కకు పెడతారు. ప్రపంచకప్ సమయంలో ఒకవేళ నాలుగు, ఐదో స్థానంలో ఎవరైన గాయపడితే అతడికి బ్యాకప్ ప్లేయర్ ఉండాలి కదా. ఉదాహరణకు శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరనేది ఆలోచించారా?. ఇప్పటికే ఆ స్థానంలో మరో ఆటగాడిని ప్రయత్నించాలి. ఒక మూడు, నాలుగు మ్యాచ్‌లు సూర్యకు అవకాశం ఇచ్చి అతడు ఎలా ఆడతాడో చూడాలి. ఒకవేళ అతడు మెరుగైన ప్రదర్శన చేస్తే నాలుగో స్థానంలో ఓ బ్యాట్స్‌మెన్ దొరికినట్లే కదా. ప్రపంచకప్‌నకు ఇప్పటినుంచే సన్నద్ధత అవసరం. కానీ ఈ సిరీస్ అలా అనిపించట్లేదు."
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
శ్రేయస్ అయ్యర్‌తో ఐదో స్థానం కోసం పోటీపడుతున్నాడు సూర్య కుమార్ యాదవ్. మొదటి టీ20లో 67 పరుగులతో ఆకట్టుకున్న శ్రేయస్.. తర్వాత మ్యాచ్‌ల్లో వరుసగా 8, 9 పరుగులతో నిరాశపర్చాడు. దీంతో ఇతడి స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ స్థానంలో ఓ బ్యాకప్ ప్లేయర్ ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.