భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఆటగాడు ఇవాళ ఈ పదవి కోసం నామినేషన్ వేశాడు. ఈ నెల 23న బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు.
"జట్టుతో పాటు వైవిధ్యం చూపగల పదవిలో ఉండటం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. రాబోయే కొన్నినెలల్లో భారత క్రికెట్‌లో సాధారణ స్థితిని తిరిగి తీసుకురాగలమని ఆశిస్తున్నా. ప్రస్తుతం క్రికెట్ జట్టు ఆటతీరు చాలా బాగుంది. ప్రపంచ కప్ సెమీఫైనల్ నుంచి నిష్క్రమించిన తర్వాత గత రెండు నెలలుగా జట్టు అద్భుతంగా ఆడుతోంది. అది కొనసాగాలని ఆశిద్దాం. క్రికెట్ అభివృద్ధి అనేది మౌలిక సదుపాయాలు, వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. జట్టు ఆటతీరు బాగా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్నిచర్యలు చేపడుతాం." -సౌరభ్ గంగూలీ, టీమిండియా మాజీ క్రికెటర్.
మరికొన్ని విషయాలనూ పంచుకున్నాడు గంగూలీ.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా కార్యదర్శిగా, అరుణ్ ధూమాల్ కోశాధికారిగా నామినేషన్ వేశారు. వీరి ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.