ఆటగాళ్లుగా కలిసి అంచెలంచెలుగా ఎదిగిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ రాహుల్ ద్రవిడ్.. ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం రాబోయే రోజుల్లో భారత క్రికెట్ మెరుగుపడటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. క్రికెట్ పరిపాలనా విభాగంలో గంగూలీ, ద్రవిడ్‌ల ప్రాముఖ్యాన్ని వివరించాడు.
"బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్‌ల భాగస్వామ్యం చాలా బాగుంటుంది. ప్రతి ఫార్మాట్లోనూ భారత జట్టు విజయవంతం కావాలంటే వీరిద్దరి భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యం. కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు, ఎన్సీఏ హెడ్ అందరూ ప్రధానమే".
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
లార్డ్స్ వేదికగా 1996లో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ సెంచరీ కోసం బాల్కనీ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురచూశానని ఇంటర్వ్యూలో వెల్లడించాడు గంగూలీ. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 301 బంతులను ఎదుర్కొని గంగూలీ 131 పరుగులు చేయగా.. ద్రవిడ్ 267 బంతుల్లో 95 పరుగులతో సెంచరీ మిస్సయ్యాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
"జట్టు విజయం కోసం నా పనితీరులో నేను మునిగిపోయా. ద్రవిడ్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు, నేను అప్పటికే 70 పరుగులు చేశా. నా వందో పరుగు కోసం కొట్టిన షాట్ నాకింకా గుర్తుంది. ఆ సమయంలో ద్రవిడ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో 131 రన్స్‌తో వెనుదిరిగా. ఆ తర్వాతి రోజు ద్రవిడ్ 95 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అప్పుడు లార్డ్స్ బాల్కనీలో నిల్చొని తన సెంచరీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశా. అండర్-15లో ద్రవిడ్‌ను తొలిసారి చూశా. ఆ తర్వాత రంజీలో ఇద్దరం కలిసి ఆడాం. ఈడెన్ గార్డెన్స్, లార్డ్స్‌లోనూ తన ప్రదర్శన చూశా. కానీ, ఆ రోజు ఇద్దరం సెంచరీలు సాధించుంటే బాగుండేది" అని ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గంగూలీ.