కఠిన పరిస్థితుల్లో కోహ్లీ బదులు తాను విలియమ్సన్‌ను ఎంచుకుంటానని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు గ్లెన్ టర్నర్ అన్నారు. వారిద్దరూ భిన్నమైన వాతావరణంలో క్రికెట్ ఆడుతూ ఎదిగారని తెలిపారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై విరాట్ చెలరేగుతాడని అయితే పేస్, స్వింగ్, చల్లని పరిస్థితులుండే మైదానాల్లో విలియమ్సన్ బాగా ఆడతాడని పేర్కొన్నారు.
"విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఆటగాళ్లు. కానీ వారి వ్యక్తిత్వాలు, అలవాటు పడ్డ పరిస్థితులు భిన్నమైనవి. కోహ్లీకి చిన్నతనం నుంచి బంతి స్వింగ్ అయ్యే, సీమింగ్ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. విలియమ్సన్‌కు అదే పిచ్‌లపై అనుభవం ఎక్కువ. విరాట్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడు. పేస్, స్వింగ్‌కు ఎక్కువగా అనుకూలించని వికెట్లపై అతడు దూకుడుగా ఆడతాడు. బౌలర్‌పై ఆధిపత్యం చెలాయిస్తాడు" అని టర్నర్ అన్నారు.
"వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే కోహ్లీలా విలియమ్సన్ దూకుడుగా ఉండడు. అయితే విజయం సాధించాలన్న తపన తక్కువగా ఉంటుందని దానర్థం కాదు. గెలవాలన్న ప్రేరణ ఇద్దరికీ ఒకేలా ఉంటుంది" అని టర్నర్ పేర్కొన్నారు.
విరాట్ ఇప్పటి వరకు 86 టెస్టులు ఆడగా 53.62 సగటుతో 7,240 పరుగులు చేయగా విలియమ్సన్ 80 టెస్టుల్లో 51.63 సగటుతో 6,476 పరుగులు చేశాడు.