భారత్-పాక్ ఆటగాళ్లు మైదానంలో ఎంత పోటాపోటీగా తలపడినా మైదానం బయట మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అన్నాడు. 'గ్రేటెస్ట్ రైవల్రీ పాడ్‌కాస్ట్'లో మాట్లాడిన అతడు పాకిస్థాన్ జట్టులో కూడా తనకు మిత్రులు ఉన్నారని చెప్పాడు. అలాగే కరాచీలో తనకు ఓ వీరాభిమాని ఉన్నాడని చెప్పాడు. 1991లో టీమ్‌ఇండియాలో చేరిన నాటి నుంచి ఆ అభిమాని తనను అనుసరిస్తున్నాడని వెల్లడించాడు. ఈ క్రమంలోనే భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా మంచి ఆతిథ్యం లభించేదన్నాడు.
"మొబైల్ ఫోన్లు లేని ఆ కాలంలో లేఖలు పంపేవాడు. తన భావాలను వాటిలోనే వ్యక్తపరిచేవాడు. పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడల్లా రషీద్ లతీఫ్‌తో వాటిని నాకు అందజేసేవాడు. ఆ అభిమాని పాక్ క్రికెటర్ వద్దకెళ్లి నాకు ఆ లేఖలు ఇవ్వమని చెప్పేవాడు. అలా అవి నా వరకు చేరేవి. ఇప్పటికీ పాకిస్థాన్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది" అని కాంబ్లీ వివరించాడు.
అలాగే తనకు వకార్ యూనిస్, వసీం అక్రమ్‌తో పాటు మిగతా ఆటగాళ్లతో స్నేహం ఉందన్నాడు. అది ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పాడు కాంబ్లీ.