టీమిండియా ఆల్‌రౌండర్ దినేశ్ మోంగియా.. అన్ని ఫార్మాట్లకు మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 57 వన్డేలు(1230 పరుగులు), ఓ టీట్వంటీ(38 పరుగులు) మ్యాచ్‌లకు కు ప్రాతినిధ్యం వహించాడు. 2003 ప్రపంచకప్ మెన్ ఇన్ బ్లూ జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడీ క్రికెటర్. అప్పుడు భారత్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.

పంజాబ్‌కు చెందిన మోంగియా.. 1995-96 మధ్యకాలంలో క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ఎడంచేతి వాటం గల దినేశ్.. స్పిన్నర్‌గానూ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 121 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 8028 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 308. ఇందులో 27 సెంచరీలు, 28 అర్ధశతకాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 2001లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

2003 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్. అందులో నామమాత్ర ప్రదర్శన చేయడం వల్ల జట్టులో నుంచి అతడ్ని తప్పించారు. చివరగా 2007లో బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు మోంగియా. టీమిండియా ఆడిన తొలి టీట్వంటీ పోరులోనూ పాల్గొన్నాడీ ఆటగాడు.
ఇది చదవండి: ఏడాది నిషేధం.. అయినా యోధులే..!