బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ ఎంత పనిలో ఉన్నా అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంటాడు. టీమిండియా తరఫున ఆడిన నాటి తన మధుర జ్ఞాపకాలను పోస్టు చేస్తుంటాడు. గురువారం గంగూలీ అలాంటి పనే మరోటి చేశాడు. 1996లో లార్డ్స్‌లో జరిగిన అరంగేట్ర టెస్టులో గంగూలీ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా అభివాదం చేస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనిపై వెంటనే యువీ కౌంటర్ వేశాడు.
కాస్త ప్రొఫెషనల్‌గా ఉండు..
గంగూలీ షేర్ చేసిన ఫొటోపై వాటర్ మార్క్ చూసిన మాజీ టీమిండియా సభ్యుడు యువరాజ్ సింగ్.. గంగూలీని ట్రోల్ చేశాడు. ఫొటోపై వాటర్ మార్క్ ఉన్న విషయాన్ని ఎత్తిచూపుతూ.."దాదా లోగోను తీసేయాలి. మీరిప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు. కాస్త ప్రొఫెషనల్‌గా ఉండండి" అని కామెంట్ పెట్టాడు.
దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ తెందూల్కర్ కూడా ఈ ఫొటోపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. పోస్టు చూడగానే ఓ అద్భుత ఇన్నింగ్స్ గుర్తొచ్చిందని... లార్డ్స్‌లో దాదా మరేదైనా విషయంలో గుర్తున్నాడా? అని నెటిజన్లను ప్రశ్నించాడు. అభిమానులు వెంటనే స్పందిస్తూ.. 2002 నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ అని వెంటనే జవాబులిచ్చారు.
జెర్సీ తీసి సంబరాలు...
లార్డ్స్ వేదికగా టెస్టు సెంచరీతో పాటు గంగూలీ జెర్సీ తీసి సంబరాలు చేసుకున్న సందర్భమూ ఉంది. 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో.. 325 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. గంగూలీ అర్ధ సెంచరీతో రాణించినా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం వల్ల అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. ఆ సమయంలో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ గెలిచిన తర్వాత గంగూలీ తన జెర్సీ తీసేసి గిరిగిరా తిప్పి సంబరాలు చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్న వారు ఎవరూ లేకపోవడం వల్ల అది సంచలనమైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">