అంతర్జాతీయ క్రికెట్లో పెరుగుతున్న ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది. టాప్ ఆటగాళ్ల దేహదారుఢ్యం, వేగాన్ని కొలిచేందుకు రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్స్‌ను నిర్వహించనుంది. కాంట్రాక్టు ఆటగాళ్లు, టీమ్‌ఇండియాలో చోటుకోసం శ్రమిస్తున్న క్రికెటర్లు ఇప్పుడున్న యోయో టెస్టుతో పాటు ఇందులోనూ తప్పక నెగ్గాల్సి ఉంటుంది.
"దేహ దారుఢ్యాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లేందుకు ఇప్పుడున్న ప్రమాణాలు కీలక పాత్ర పోషిస్తాయని బోర్డు అంచనా వేస్తోంది. ఫిట్‌నెస్ ప్రమాణాలను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం. టైమ్ ట్రయల్స్ కసరత్తు మరింత పోటీ పడేందుకు ఆటగాళ్లకు ఉపకరిస్తుంది. ఏటా ప్రమాణాలను బోర్డు సవరిస్తూ ఉంటుంది"
-బీసీసీఐ అధికారి
కొత్త ప్రమాణాల ప్రకారం ఫాస్ట్ బౌలర్లు 8.15 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, స్పిన్నర్లు అయితే 8.30 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇక యోయో స్థాయి ఎప్పటిలాగే 17.1గా ఉండనుంది.
సరికొత్త ప్రమాణాల గురించి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే క్రికెటర్లకు బోర్డు తెలియజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్, ఆగస్టు/సెప్టెంబర్‌లో ఈ ట్రయల్స్ ఉంటాయని సమాచారం. ఇప్పటికైతే ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చిన వారికి మినహాయింపు కల్పించారు. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీసు, టీ20 ప్రపంచకప్‌కు పోటీపడేవాళ్లు మాత్రం టైమ్ ట్రయల్స్ టెస్టులో పాల్గొనాల్సిందే.
ఇదీ చూడండి: మోదీజీ.. ఇదే నా ఫిట్‌నెస్ రహస్యం : కోహ్లీ