మరి అలాంటి యువ క్రికెటర్.. దిగ్గజ ఆటగాడు నెలకొల్పిన ఘనతలను అందుకుంటాడా? అంటే పలువురు మాజీలు అవును అనే సమాధానమిస్తున్నారు. అయితే సచిన్ ఖాతాలో ఉన్న ఓ ఐదు రికార్డులు మాత్రం కోహ్లీకి సవాల్ విసరనున్నాయి.
1) అత్యధిక వన్డేలు ఆడిన ఘనత
టీమిండియా తరఫున సచిన్ మొత్తం 465 వన్డేలు ఆడాడు. 16 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసిన లిటిల్ మాస్టర్.. దాదాపు 22 సంవత్సరాలు కొనసాగాడు. తెందుల్కర్‌కు పోటీగా శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య.. 22 ఏళ్ల పాటు క్రికెట్లో ఉన్నాడు. కానీ, 445 వన్డే మ్యాచ్‌లే ఆడగలిగాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్రికెట్లో అరంగేట్రం చేసి 11 ఏళ్లు గడిచింది. ఇప్పటికి 248 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ ఆటగాడు మరో 8 సంవత్సరాల పాటు ఆటను కొనసాగిస్తే.. సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
2) అత్యధిక టెస్టు మ్యాచ్‌లు
1989 ద్వితీయార్ధంలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు సచిన్. 200 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి.. ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మాస్టర్ తర్వాతి స్థానంలో.. ఆసీస్ మాజీలు రికీ పాంటింగ్, స్టీవ్ వా.. 168 టెస్టులు ఆడారు.
ఈ రికార్డూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి సవాల్‌గానే మారనుంది. కోహ్లీ ఇప్పటి వరకు 86 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ కాలం కొనసాగడం అంత సులభం కాదు. అయితే ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టే విరాట్.. గాయాల బారిన పడకపోతే ఈ రికార్డు అందుకోవచ్చు.
3) అత్యధిక టెస్టు పరుగులు
'గాడ్ ఆఫ్ క్రికెట్' అని గూగుల్‌లో వెతికిచూస్తే.. అది సచిన్ పేరునే చూపిస్తుంది. అందుకు కారణం క్రికెట్లో అతడి పేరుతో ఎన్నో రికార్డులు నమోదవ్వటమే. టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించి మాస్టర్.. ఈ ఘనతనూ ఖాతాలో వేసుకున్నాడు.
2008 అక్టోబరు 17 వరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు లారా (11,953 పరుగులు) పేరుతో ఉండేది. ఆ ఘనతను అవలీలగా దాటాడు మాస్టర్. 15,921 పరుగులు సాధించి మొదటి స్థానానికి ఎగబాకాడు. 13,378 పరుగులతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు 86 మ్యాచ్‌ల్లో 7,240 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే కోహ్లీ ఈ రికార్డును అందుకునేందుకు ఛాన్స్‌లు ఉన్నాయి.
4) టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక బౌండరీలు
ప్రారంభంలో క్రికెట్‌కు తక్కువ ఆదరణ ఉన్నా.. 1983 ప్రపంచకప్ తర్వాత భారతదేశంలో బాగా పేరు తెచ్చుకుంది. ఈ క్రీడను మన దేశంలో ఆదరించటానికి ప్రధాన కారణం సచిన్ తెందుల్కర్. అత్యధిక టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక బౌండరీలు సాధించాడు మాస్టర్. టెస్టు ఫార్మాట్లో మొత్తం 2127 బౌండరీలు సాధించాడు. ఇందులో 2058 ఫోర్లు, 69 సిక్సర్లు ఉన్నాయి.
టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 833 బౌండరీలు సాధించగా.. అందులో 811 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. సచిన్ రికార్డును అందుకోవటానికి ఇంకా 1294 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. సచిన్ శైలిలోనే విరాట్ బౌండరీలు బాదడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు.
5) అత్యధిక ప్రపంచకప్‌ల్లో బరిలోకి
సచిన్ తెందుల్కర్.. టీమిండియా తరఫున ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ రికార్డులో పాక్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ మాస్టర్ సరసన ఉన్నాడు.
1992.. ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 1996లో ఇండియా/పాకిస్థాన్, 1999లో ఇంగ్లాండ్, 2003లో దక్షిణాఫ్రికా/జింబాబ్వే, 2007లో వెస్టిండీస్, 2011లో ఇండియా/శ్రీలంక/జింబాబ్వే వేదికలుగా జరిగిన పలు విశ్వకప్లలో మాస్టర్ బరిలోకి దిగాడు.
విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు మూడు ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఈ టోర్నీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2015లో ఆస్ట్రేలియా/న్యూజిలాండ్, 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన విశ్వకప్లలో భారత జట్టు తరఫున ఆడాడు. సచిన్ రికార్డును అందుకోవటానికి విరాట్‌కు మరో మూడు ప్రపంచకప్‌లే ఉన్నాయి.
ఇదీ చూడండి.. 'సచిన్‌ను డకౌట్ చేయడమే నాకు కలిసొచ్చింది'