తన కెరీర్ చివరి సమయాల్లో బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆరోపించాడు. తానెప్పుడూ ఫేర్వెల్ మ్యాచ్ కోరుకోలేదని.. కానీ కనీస గౌరవం పొందే అర్హత తనకుందని పేర్కొన్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది జూన్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు యువీ.
"మొదట అందరూ తెలుసుకోవాల్సింది.. నేను లెజండ్ అని ఎప్పుడ అనుకోలేదు. చిత్తశుద్ధితో ఆట ఆడాను. కానీ, ఎక్కువగా టెస్టు క్రికెట్లో పాల్గొనలేదు. లెజండరీ ఆటగాళ్లుకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంటుంది. ఎవరికి ఫేర్వెల్ ఇవ్వాలనే విషయం నేను నిర్ణయించేది కాదు. అది బీసీసీఐకి సంబంధంచింది."
-యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
మంచి ఆటాగాళ్లతో బీసీసీఐ క్రమక్రమంగా అనుచితంగా ప్రవర్తించడం సాధారణమైపోయిందని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. అందువల్ల తాను పెద్దగా ఆశ్చర్యపోవడం లేదని ఎద్దేవా చేశాడు. "నా కెరీర్ చివర్లో వారు నాతో ప్రవర్తించే తీరు ప్రోఫెషనల్గా లేదని భావించా. అంతే కాదు, హర్భజన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడా ఇలాగే ప్రవర్తించారు. కాబట్టి భారత క్రికెట్లో ఇదొక భాగమైపోయింది. గతంలో నేను ఇవన్నీ చూశాను.. కాబట్టే పెద్దగా ఆశ్చర్యం కలగట్లేదు" అని యువరాజ్ అన్నాడు. కనీసం భవిష్యత్తులోనైనా టీమ్ఇండియా కోసం ఎంతగానో కృషి చేసిన ఆటగాళ్లను గౌరవంగా చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు యువీ.