ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మధ్యంతర సీఈవో నిక్‌హాక్లే టీ20 ప్రపంచకప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులు లేకుండా ఈ మెగా టోర్నీని చూడడానికి ఇష్టపడతారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించాడు. తమ దేశంలో టీ20 ప్రపంచకప్ ఎప్పుడు నిర్వహించినా ప్రేక్షకులను అనుమతిస్తామని చెప్పాడు.
"కరోనా వైరస్ నెలకొన్న ఇలాంటి పరిస్థితుల్లో 15 జట్లతో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం చాలా కష్టం. అయితే, ఆస్ట్రేలియాలో ఆ టోర్నీని ఎప్పుడు నిర్వహించినా ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడడానికి ప్రేక్షకులకు అనుమతిస్తాం. ఇటీవల కొన్ని పరిస్థితులను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. మాకు అతిపెద్ద సవాలు ఏమిటంటే 15 జట్లను ఇక్కడికి అనుమతించాలి. ఇదే ఒక ద్వైపాక్షిక సిరీస్ అయితే, ఒక జట్టును తీసుకొచ్చి వారితో మ్యాచ్‌లు నిర్వహించొచ్చు. కానీ ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌కు 15 జట్లు వస్తాయి. అందులో ఆరు, ఏడు జట్లు ఒకే సమయంలో ఒకే నగరంలో ఒకే చోట ఉండాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అదంత తేలికైన విషయం కాదు."
- నిక్ హాక్లే, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించిన పరిస్థితుల్లో ఈ ఏడాది నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ విషయంపై చర్చించేందుకు ఐసీసీ ఈనెల ఆరంభంలో సమావేశమైనా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని జులైలో తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది.
ఇదీ చూడండి... రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి భజ్జీ చిట్కా..!