కుల్దీప్ యాదవ్.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017 మార్చిలో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే జట్టులో చేరి అతడు నాలుగేళ్లుగా రాణిస్తున్నా.. కుల్దీప్కు మాత్రం సరైన గుర్తింపు రావడం లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణం రెండేళ్లుగా కుల్దీప్ జాతీయ జట్టులో ఆడకపోవడమే.
సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే.. 2019 జనవరి 3న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. మొత్తంగా ఆ సిరీస్‌లో ఆడిన ఆరు టెస్టుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ సిరీస్ తర్వాత రెండేళ్లపాటు కుల్దీప్కు టెస్టులతో సహా వన్డే, టీ20ల్లోనూ ఆడే అవకాశం రాలేదు. దీంతో దాదాపుగా 764 రోజుల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కుల్దీప్ ఉత్తమ ప్రదర్శన చేస్తున్నా.. తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం వెనుకు ఏమైనా దురుద్దేశం ఉందా?
మరోసారి మొండిచేయి
చెన్నైలోని చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలిటెస్టులో మోకాలు గాయం కారణంగా అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరో స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను స్క్వాడ్‌లో చేర్చారు.
అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల స్క్వాడ్‌లో కుల్దీప్ను ఎంపికచేశారు. అక్షర్ పటేల్ జట్టుకు దూరమైనా.. అతడి స్థానంలో టెస్టుల్లో మిగిలిన వారికంటే అనుభవజ్ఞుడైన కుల్దీప్కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రాక్టీసు మ్యాచ్‌లో కుల్దీప్ ఆడినా.. తొలి టెస్టులో మాత్రం అతడ్ని పక్కనపెట్టి షాబాజ్ నదీమ్ వంటి యువ స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వడం పట్ల టీమ్ఇండియా సెలెక్టర్లపై పలు రకాల సందేహాలకు తావిస్తోంది.
నెట్టింట విమర్శలు
కుల్దీప్ చివరిసారిగా ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టులో ఉత్తమంగా రాణించినా.. ఇప్పుడు తుదిజట్టులో అతడికి అవకాశం లభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నెటిజన్లు కూడా కుల్దీప్ను ఎంపిక చేయకపోవడంపై మీమ్స్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: భారత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ - ఏడాది తర్వాత తొలిసారి