టీమ్ఇండియా అగ్రశ్రేణి పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లిపై వస్తున్న ఉహాగానాలకు తెరపడింది. తనో ఇంటివాడినయ్యానని సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం అతనే స్వయంగా ప్రకటించాడు. కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్లే ఓ క్రీడా ఛానెల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజనా గణేశన్‌ను అతను వివాహమాడాడు. గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహా వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ కారణంగా బయోబబుల్‌లో ఉన్న భారత క్రికెటర్లు బుమ్రా పెళ్లికి హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. పెళ్లి కారణంగా టీ20 సిరీస్‌కు దూరమైన బుమ్రా.. ఇక సరాసరి ఐపీఎల్లో ఆడతాడేమో తెలియాల్సిఉంది.
అయితే క్రికెటర్లు, స్పోర్ట్స్ ప్రెజెంటర్లు.. వివాహ బంధంతో ఒక్కటవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు.. వ్యాఖ్యాతలను తమ జీవితభాగస్వామిగా చేసుకున్నారు. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ.. స్పోర్ట్స్ ప్రెజెంటర్ మయంతి లాంగర్‌ను 2012లో పెళ్లి చేసుకున్నాడు.
అదే విధంగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియాకు చెందిన టీవీ ప్రెజెంటర్ లీ పుర్లాంగ్ను 2010లో వివాహం చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ ప్రజెంటర్ రోజ్ కెల్లీని మనువాడాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్.. లారా మెక్ గోల్డ్ రిక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కటింగ్.. ఎరిన్ హోలాండ్ ఈ ఏడాది ప్రారంభంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతేడాదే వీరి వివాహం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇదీ చూడండి: రూమర్లకు చెక్.. సంజనా గణేశన్‌తో బుమ్రా పెళ్లి