వన్డేల్లో ఓడినా సరే టీ20ల్లో చెలరేగుతున్న టీమ్ఇండియా.. 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. నామమాత్రపు మూడో మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో మంగళవారం ఆడనుంది. ఇందులో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని కోహ్లీసేన చూస్తుండగా, పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ ప్రణాళికలు వేస్తోంది.
అప్పటిలానే మళ్లీ జరుగుతుందా?
2016లోనూ ఆసీస్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయి, టీ20 సిరీస్‌ను 3-0తో చేజిక్కుంచుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో అలానే ఓడిపోగా, టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి మ్యాచ్ కూడా గెలిస్తే అప్పటి సీన్ రిపీట్ అవుతుంది!
వాళ్లు లేకపోయినా సరే..
రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్స్ లేకపోయినా సరే సిరీస్ గెలిచామని రెండో టీ20 అనంతరం కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ సమష్టి ప్రదర్శన చేసిన జట్టు.. ఆసీస్‌పై విజయం సాధించింది. చివరి టీ20లోనూ అలానే ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
కోహ్లీ, ధావన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో నటరాజన్ మినహా మిగిలిన వారు పరుగులు సమర్పిస్తున్నారు. అలా కాకుండా రన్స్ని కట్టడి చేయగలిగితే భారత్ గెలుపు లాంఛనమే!
ఆసీస్‌కు తప్పని గాయాల బెడద
భారత ఆటగాళ్ల మెరుగైన ప్రదర్శన, తమ జట్టులోని కీలక ఆటగాళ్లకు గాయాలు కావడం వల్ల ఆసీస్ వరుస మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. చివరి టీ20లోనైనా విజయం సాధించి టెస్టులకు సానుకూలంగా సిద్ధమవ్వాలని భావిస్తోంది.
జట్లు(అంచనా)
టీమ్ఇండియా: ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, నటరాజన్, చాహల్
ఆస్ట్రేలియా: షార్ట్, స్టోయినిస్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, వేడ్(కెప్టెన్), డేనియల్ సామ్స్, సీన్ అబాట్, స్వెప్సన్, ఆండ్రూ టై , జంపా