సిరాజ్ టెస్టుల్లో టీమ్‌ఇండియా తరపున ఆడడం వల్ల తమ నాన్న కల నెరవేరిందని అతని సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్.. అత్యధిక వికెట్లు (13) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. రెండో టెస్టులో అతను అరంగేట్రం చేయగా.. సిరీస్‌కు ముందే అతని తండ్రి మరణించారు. జట్టుతో పాటే ఉండాలని నిర్ణయించుకున్న సిరాజ్.. తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. సిరీస్ విజయానంతరం నగరంలోని సిరాజ్ ఇంటి దగ్గర సందడి వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే తమ సంతోషాన్ని ఈటీవీ భారత్తో పంచుకున్నాడు సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్.
"సిరాజ్ టెస్టుల్లో భారత్ తరపున ఆడాలనేది చనిపోయిన మా నాన్న కల. ఆయనెప్పుడూ సిరాజ్‌ను నీలం (పరిమిత ఓవర్ల), తెలుపు (టెస్టు) రంగు జెర్సీల్లో చూడాలని అనుకున్నారు. ఇప్పుడా కల నెరవేరింది. దాన్ని సిరాజ్ నిజం చేశాడు. భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ గెలుపులో సిరాజ్ భాగస్వామ్యం ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది. సిరాజ్ అరంగేట్ర టెస్టు నుంచి ప్రతి రోజు అతని ఆట చూస్తునే ఉన్నాం. భారత్‌కు అతను ఆడుతున్నాడంటే ఎంతో ఉత్తేజమేసింది. తన ఎంపికకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంట్లో ఎలాంటి సంబరాలు చేసుకోవడం లేదు. కానీ దేశం, ఈ నగరం అతని ప్రదర్శన కారణంగా సంబరాలు చేసుకుంటోంది" అని ఇస్మాయిల్ అన్నాడు. "సిరాజ్ భాయ్ ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్ నెగ్గింది." అని సిరాజ్ స్నేహితుడు షఫీ ఆనందంతో తెలిపాడు.
ఇదీ చూడండి : సిరాజ్.. నీ తండ్రి ఎక్కడున్నా గర్వపడతాడు!