దేశవాళీ, ఐపీఎల్లో సత్తాచాటి టీమ్ఇండియా జెర్సీ ధరించాడు యువ స్పిన్నర్ రాహుల్ చాహర్. లాక్డౌన్ కారణంగా ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్న చాహల్ పలు విషయాలను ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తనకు సొంత మైదానం ఉందని అక్కడే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు.
టీమ్ఇండియాకు ఆడే అవకాశం రావడం గురించి?
నా కల నిజమైంది. 2019 నాకు మరిచిపోలేని ఏడాది. ఆ సంవత్సరం దేశవాళీ క్రికెట్లో నేను 70-80 వికెట్లు సాధించాను. ఐపీఎల్‌లోనూ సత్తాచాటాను. అనంతరం టీమ్ఇండియాకు ఆడే అవకాశం వచ్చింది. అందుకే నాకు 2019 చాలా ప్రత్యేకం.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీ గురించి?
ఇద్దరికీ జట్టు గెలుపే ముఖ్యం. ఇద్దరూ నన్ను సొంత సోదరుడిలా ఆదరించారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ఐసీసీ నూతన నిబంధనల గురించి?
ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడటంలో చాలా తేడా ఉంటుంది. ఆటగాళ్ల ఉత్సాహం తగ్గుతుంది. ప్రేక్షకులు ఉంటే వారిచ్చే ఎనర్జీ ఆటగాళ్లకు బూస్ట్‌లా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడూ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నా రంజీ మ్యాచ్ ఆడినట్లే ఉంటుంది.
బంతిపై లాలాజలం రుద్దడం నిషేధంపై?
వన్డే, టీ20ల్లో ఈ నిబంధన వల్ల పెద్ద సమస్యేమీ ఉండదు. కానీ టెస్టుల్లో దీని ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే వికెట్లను సాధించేందుకు బంతికి మెరుపు తీసుకురావడం చాలా ముఖ్యం.