ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) భారీ విరాళాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా తమ జీతాల్లో(మూడు నెలలు) 20 శాతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఈ ప్రతిపాదన చేయగా ఆటగాళ్లు అందుకు ఒప్పుకున్నారు. ఇంగ్లాండ్ పురుషుల మూడు నెలల జీతాల్లో 20 శాతం అంటే 5లక్షల పౌండ్లతో సమానం. ఇక మహిళా క్రికెటర్లు కూడా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తమ జీతాల నుంచి విరాళం ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
"ఛారిటబుల్ డొనేషన్‌కు సంబంధించిన వివరాలపై ఇంకో వారంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ విరాళం మొత్తం ఇంగ్లాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల మూడు నెలల జీతంలో 20 శాతంతో సమానం. ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈసీబీతో చర్చలు కొనసాగిస్తాం. ఇక్కడ క్రికెట్ కార్యకలాపాలతో పాటు బయటి పరిస్థితులు మెరుగయ్యేందుకు అవసరమైన విధంగా సమష్టిగా సహకరిస్తాం"
-ఇంగ్లాండ్ క్రికెటర్లు
కరోనాపై పోరుకు ఇదివరకే పలువురు క్రికెటర్లు స్వతంత్రంగా తమకు చేతనైన సాయం చేశారు. వికెట్ కీపర్ జాస్ బట్లర్ 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీని వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక మహిళా జట్టు సారథి హీథర్ నైట్ జాతీయ ఆరోగ్య సర్వీస్‌తో కలిసి వాలంటీర్‌గా పనిచేస్తోంది.