యూకేలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వందలాదిమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథి హీతర్ నైట్... నేను సైతం అంటూ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో సభ్యురాలిగా చేరింది..
నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది బ్రిటన్ వైద్య విభాగానికి అనుసంధానంగా పనిచేస్తున్న సంస్థ. మందుల రవాణా వంటివి ఈ సంస్థ చేపడుతుంది. దీంతోపాటు, కరోనా వైరస్ ప్రభావంపై ప్రజల్లో అవగాహనకు కృషి చేస్తుంది. ఇందులో సభ్యురాలిగా చేరింది హీతర్ నైట్. సేవాభావం ఉండి, కరోనాపై పోరాడాలనే ఆసక్తి ఉన్నవారిని గత బుధవారం ఎన్‌హెచ్‌ఎస్ ప్రకటన ద్వారా ఆహ్వానించింది. అది చూసి వెంటనే చేరిపోయింది హీదర్.
"మా కుటుంబంలో ఇద్దరు వైద్యవృత్తిలో ఉన్నారు. అలాగే నా స్నేహితులు కొందరు ఎప్పటి నుంచో ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. వాళ్లలోని సేవాభావం చూసినప్పుడు నాకూ సేవ చేయాలనిపించేది. ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. నిజానికి నాకంటే నా స్నేహితురాళ్లు కొందరు ఎన్నో సవాళ్ల మధ్య పనిచేస్తున్నారు. వాళ్లలో ఎలిన్ ఒకమ్మాయి. ఆమెపై ఒత్తిడిని తగ్గించేందుకు తనకిష్టమైన పాటలను పంపిస్తున్నా. దాంతో తనకి కొంతైనా ఉపశమనం అందుతుందని భావిస్తున్నా. మనకోసం పోరాడుతున్న వైద్యులను కాపాడే బాధ్యత మనదే" అంటోంది హీతర్.