భారత పర్యటనకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉందని, అందుకోసం పూర్తిగా సన్నద్ధమైందని శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే అభిప్రాయపడ్డాడు. లంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ సోమవారం ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు లంక పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 5 నుంచి టీమ్‌ఇండియాతో తలపడే టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్ల్లాండ్ బాగా సన్నద్ధమైందని జయవర్ధనే పేర్కొన్నాడు.
'భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆసక్తిగా ఉంటుంది. ఇరు జట్లకూ ఇదెంతో సవాలుగా నిలుస్తుంది. విదేశాలకు వెళ్లి టెస్టులు గెలవడం గొప్ప విశేషం. బెన్‌స్టోక్స్ చేరిక ఇంగ్లాండ్‌కు అతిపెద్ద సానుకూల అంశం. అతడి అనుభవమే కాకుండా టాప్‌ఆర్డర్‌లో మరో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా పనికొస్తాడు. అలాగే బెయిర్‌స్టో జట్టును వీడటం నిరాశను కలిగించింది. లంక పర్యటనలో అతడి ప్రదర్శన చూస్తే కచ్చితంగా టీమ్‌ఇండియాతో ఆడాల్సి ఉంది. మరోవైపు ఆర్చర్ కూడా జట్టులో చేరాడు. అతడు కూడా ప్రభావం చూపగలిగే ఆటగాడే. మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్ బాగానే సన్నద్ధమైందని తెలుస్తోంది' అని జయవర్ధనే వివరించాడు.
ఇంగ్లాండ్ టీమ్ బుధవారం శ్రీలంక నుంచి చెన్నై చేరుకోనుంది. అనంతరం ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండి, మూడు రోజులు ప్రాక్టీస్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 5 నుంచి టీమ్‌ఇండియాతో చెన్నైలో రెండు టెస్టులు, 24 నుంచి అహ్మదాబాద్‌లో మరో రెండు టెస్టులు ఆడనుంది. తర్వాత ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
ఇదీ చూడండి: ఐపీఎల్: ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడు అతడేనా?