ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. విల్లేతో పాటు అతడి భార్యకు పాజిటివ్‌గా తేలింది. వీరు ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.
"నాకు మద్దతుగా నిలుస్తూ ప్రార్థనలు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నాాతో పాటు నా భార్యకు టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది" అని తెలిపాడు విల్లే.
ప్రస్తుతం విల్లే యార్క్‌షైర్ తరఫున విటలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఆడుతున్నాడు. ఇతడికి కరోనా తేలడం వల్ల మిగిలిన గ్రూప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదు. ఇతడితో పాటు మరో ముగ్గురు కూడా మిగిలిన మ్యాచ్‌లను ఆడట్లేదని యార్క్‌షైర్ యాజమన్యం స్పష్టం చేసింది. విల్లేకు కరోనా నిర్ధరణ అయ్యేముందు అతడు వీరితో కలిసి ఉండటమే కారణం. మిగిలిన ముగ్గురిని 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.
విల్లే ఇంగ్లాండ్ తరఫున 49 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. గత నెల ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 2018 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు.