పాకిస్థాన్‌తో మూడో టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ పడి లేచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు సగం ఆట వరకు ఒడుదొడులకు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత పుంజుకుని ఆట ఆఖరుకు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఎనిమిదో టెస్టు ఆడుతూ కెరీర్లో తొలి శతకం సాధించిన యువ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ (171 బ్యాటింగ్; 269 బంతుల్లో 194) జట్టును మంచి స్థితికి తీసుకెళ్లాడు. అతడికి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ (87 బ్యాటింగ్; 148 బంతుల్లో 94, 26) నుంచి చక్కటి సహకారం అందింది. వీళ్లిద్దరూ అభేద్యమైన అయిదో వికెట్‌కు 205 పరుగులు జోడించారు.
ఫాస్ట్‌బౌలర్ షాహిన్ అఫ్రిదీ (1/71).. ఓపెనర్ రోరీ బర్న్స్ (6)ను ఇన్నింగ్స్ అయిదో ఓవర్లోనే పెవిలియన్ చేర్చి పాక్‌కు శుభారంభాన్నందించాడు. ఈ దశలో సిబ్లీ (22)తో జత కలిసిన క్రాలీ.. నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ 73/1తో కుదురుకున్నట్లు కనిపించగా.. సిబ్లీని స్పిన్నర్ యాసిర్ షా (2/107) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంచ్ విరామానికి స్కోరు 91/2. రెండో సెషల్లో ఇంగ్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. కీలకమైన రూట్ (29)తో పాటు ఒల్లీ పోప్ (3) వికెట్లను చేజార్చుకున్న ఆ జట్టు.. ఒక దశలో 127/4తో నిలిచింది. కానీ క్రాలీ, బట్లర్ జోడీ పట్టుదలతో నిలబడి.. పాక్‌కు ఇంకొక్క వికెట్ కూడా దక్కకుండా చేసింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. రెండో టెస్టు డ్రా అయింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇదే.