కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని విధ్వంసకర ప్రదర్శన చేశాడు. బార్బడోస్ ట్రిడెంట్స్ తరఫున ఆడిన ఈ క్రికెటర్.. 15 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. సీపీఎల్‌లో వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఫలితంగా అతడి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ లక్ష్యం ప్రత్యర్థి ముందుంచింది.
లక్ష్య ఛేదనలో ట్రింబాగో నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. బార్బడోస్ ట్రిడెంట్స్ 63 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీసిన డుమిని.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకున్నాడు.
10 బంతుల్లో 47 పరుగులు...
ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో... ట్రిడెంట్స్ జట్టు తరఫున ఆడిన డుమిని విశ్వరూపం ప్రదర్శించాడు. తొలి మూడు పరుగులు చేయడానికి ఐదు బంతులు తీసుకున్న ఈ ఆటగాడు తర్వాత మెరుపులు మెరిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 10 బంతుల్లోనే 47 పరుగులు పిండుకున్నాడు. మొత్తం 20 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు.
సీపీఎల్‌లో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన అర్ధశతక రికార్డును తిరగరాశాడు డుమిని. ఈ నెలలోనే లూయిస్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
యువరాజ్ రికార్డు పదిలం...
టీ20 ఫార్మాట్లో వేగవంతమైన అర్ధశతకం మాత్రం టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిటే ఉంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ 12 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు.