కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. భారత్‌లో మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ఈ ఏడాది ఇక్కడ సిరీస్‌లు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పలు సిరీస్‌లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఐపీఎల్ యూఏఈకి తరలివెళ్లింది. తాజాగా టీమ్ఇండియా భవిష్యత్ ప్రణాళికలపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో స్పష్టతనిచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తలపడతారని వెల్లడించాడు.
"కోహ్లీసేన ఈ ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుంది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తలపడుతుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. దీని తర్వాత ఏప్రిల్‌లో ఐపీఎల్ నిర్వహిస్తాం."
-బీసీసీఐ లేఖలో గంగూలీ
ఈ టోర్నీలతో పాటు వచ్చే ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. తర్వాత ఏడాది 2023లో వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయంపైనా క్లారిటీ ఇచ్చాడు గంగూలీ. ఈ రెండు మెగాటోర్నీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
దేశవాళీ టోర్నీలపై!
ప్రతి ఏడాది దేశవాళీ టోర్నీలు ఆగస్టులో ప్రారంభం అవుతాయి. కానీ ఈ ఏడాది మహమ్మారి వల్ల టోర్నీల నిర్వహణ కష్టతరంగా మారింది. దీనిపైనా స్పందించిన గంగూలీ పరిస్థితులు చక్కబడ్డాక పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించాడు. మరికొన్ని వారాల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని.. అప్పుడు సురక్షిత వాతావారణంలో దేశవాళీ టోర్నీలు నిర్వహిస్తామని స్పష్టం చేశాడు.