టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచీ అతడి గురించి, అతడి కెప్టెన్సీ గురించి అనేక మంది ప్రశంసిస్తున్నారు. తనదైన వ్యక్తిత్వం, ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు ధోనీ. అతడో గొప్ప ఆటగాడే కాకుండా, అత్యుత్తమ ఫినిషర్, కెప్టెన్ అని మెచ్చుకుంటున్నారు. అలాంటి ఆటగాడు.. అనుకోకుండా ఒక పాకిస్థాన్ క్రికెటర్ డేటింగ్ రద్దుకు కారణమయ్యాడట.
ధోనీ 2005లో జాతీయ జట్టుకు ఎంపికవ్వకముందు ఇండియా-ఏ టీమ్‌లో ఆడాడు. అప్పుడు కెన్యాలో పాకిస్థాన్-ఏ, భారత్-ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో రెచ్చిపోయి ఆడి 360 పరుగులు చేశాడు. దాంతో సెలక్టర్ల దృష్టిలో పడి టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. ఇది పక్కన పెడితే.. ఆ ట్రై సిరీస్‌లోనే పాకిస్థాన్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో మహీ సిక్సుల వర్షం కురిపించాడు.
అదే సమయంలో లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓ పాకిస్థాన్ క్రికెటర్.. ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ భారత్ యువతిని పరిచయం చేసుకున్నాడు. అదే రోజు మ్యాచ్ అయ్యాక ఆ యువతితో రెస్టారెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆమె కూడా అంగీకరించడం విశేషం. అయితే, ధోనీ కొట్టిన ఓ భారీ సిక్సర్ నేరుగా వెళ్లి ఆమెకు తగిలింది. దీంతో ఆ యువతి గాయపడి ఆస్పత్రి పాలైంది. చివరికి ఆ పాకిస్థాన్ క్రికెటర్ ఆశలు అడియాశలయ్యాయి. ఇది మహీ కావాలని చేయకపోయినా.. అనుకోకుండా జరిగిపోయిందని క్రిక్‌బజ్ ఓ కథనంలో పేర్కొంది.
ఆ సిరీస్ తర్వాత ధోనీ టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడగా పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. అనంతరం పాకిస్థాన్‌తో ఆడిన వైజాగ్ వన్డేలో తనలోని అసలైన క్రికెటర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ మ్యాచ్‌లో 148 పరుగులు చేసి.. ఆ తర్వాత శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ధోనీ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇక 2007 నుంచీ 2017 వరకు పదేళ్లపాటు జట్టు సారథిగా కొనసాగడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు.