టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకున్నంత చక్కగా బహుశా మరే క్రికెటర్ దాన్ని వినియోగించుకొని ఉండడు. అతను తీసుకునే ఆ సమీక్షలకు 99 శాతం కచ్చితమైన ఫలితాలే వస్తాయి. దాంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను అభిమానులు, ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుస్తారు. అయితే టీమ్‌ఇండియా మొదట్లో ఆ పద్ధతిని వ్యతిరేకించిందని, అమలు చేయడానికి ఒప్పుకోలేదనే మాజీ క్రికెటర్ ఆకాశ్‌చోప్రా అన్నాడు. పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్ సవేరా పాషాతో ఇటీవలే మాట్లాడుతూ దీనితో పాటే పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
"ఈ డీఆర్‌ఎస్ పద్ధతిని తొలిసారి టీమ్‌ఇండియానే ఉపయోగించుకుంది. 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా అది జరిగింది. అప్పుడు ధోనీ కాకుండా అనిల్ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌లో భారత్ కొన్ని తప్పుడు సమీక్షలు తీసుకుంది. అప్పట్లో అది కొత్త సాంకేతిక పద్ధతి కావడం వల్ల మేం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు తప్పుడు ఫలితాలు వచ్చాయి. అప్పుడే టీమ్‌ఇండియాకు నచ్చలేదని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ పద్ధతిని వ్యతిరేకించాం. ఇంకా చెప్పాలంటే ధోనీకీ అది నచ్చలేదు. అయితే, కెప్టెన్ అభిప్రాయానికే విలువ ఉంటుంది. అది సాంకేతిక పరమైన విషయమైనా పూర్తిస్థాయిలో సరైన ఫలితం ఇవ్వదని చాలాకాలం తర్వాత ధోనీ నమ్మాడు. మరోవైపు ఇప్పటికీ అంపైరింగ్ నిర్ణయాల్లో వివాదాలున్నాయి. డీఆర్‌ఎస్‌పైనా అనుమానాలున్నాయి. కానీ ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి" - ఆకాష్ చోప్రా, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
అలా ధోనీకి నచ్చకపోవడం వల్ల టీమ్‌ఇండియా దాన్ని వ్యతిరేకించేదని చెప్పాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే, డీఆర్‌ఎస్‌కు వీరాభిమాని అని, ప్రతీ మ్యాచ్‌లో దాన్ని అమలు చేయాలని కోరుకుంటాడని వెల్లడించాడు. అది ఐపీఎల్ అయినా రంజీ అయినా కోహ్లీ ఆ పద్ధతికి ఒప్పుకుంటాడన్నాడు. సాంకేతిక అంశాల పరంగా ఇప్పుడు అందరి ఆలోచనలు మారాయని, దాన్ని అలాగే కొనసాగిస్తూ మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాశ్‌చోప్రా అకాంక్షించాడు.
చివరగా ఆ పద్ధతి ధోనీకి నచ్చకపోయినా, తాను మాత్రం దాన్ని ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుస్తానని తెలిపాడు. ఎందుకంటే అతడు తీసుకునే సమీక్షల్లో 10లో 9 సార్లు సరైన ఫలితాలొస్తాయని గుర్తుచేశాడు. ఒకవేళ ధోనీ అంచనా తప్పని మనకు అనిపించినా ఫలితం మాత్రం అతడికి అనుకూలంగానే వస్తుందన్నాడు.