2007 వన్డే ప్రపంచకప్ తర్వాత బంగ్లాదేశ్ పసికూన అనే ముద్ర చెరిపేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ మెగా టోర్నీలో బలమైన టీమ్ఇండియాను ఓడించి సంచలన విజయాలు నమోదు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే నాటి నుంచీ బంగ్లాదేశ్.. భారత్‌కు మరో దాయాది జట్టుగా తయారైంది.
ఈ క్రమంలోనే 2016 టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన లీగ్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠకు దారితీసింది. చివరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఆ ఉత్కంఠ పోరు జరిగి నేటికి నాలుగేళ్లు గడిచాయి. ఆ విశేషాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.
కివీస్‌తో ఓటమి.. బంగ్లాతో ఉత్కంఠ..
2016 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చినా టీమ్ఇండియా సెమీస్ నుంచే నిష్క్రమించింది. తొలి టీ20లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్న భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. తర్వాత బంగ్లాతో జరిగిన మూడో టీ20 భారత అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా భారత్.. బంగ్లాదేశ్ చేతిలో మరో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటుందని అంతా భావించారు. కానీ, భారత బౌలర్లు మాయ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కట్టడి చేసిన భారత బౌలర్లు..
ఛేదనలో బంగ్లా ఓపెనర్ తమిమ్ ఇక్బాల్(35) రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్ ఎవ్వరూలేరు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడం వల్ల షబ్బిర్ రహ్మాన్(26), షకిబ్ అల్ హసన్(22) భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఇక చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 11 పరుగులు అవసరమైన వేళ నాటి కెప్టెన్ ధోని.. బంతిని హార్దిక్ పాండ్య చేతికి ఇచ్చాడు.
తొలి బంతికి సింగిల్ ఇచ్చిన పాండ్య.. తర్వాతి రెండు బంతులకు మూల్యం చెల్లించుకున్నాడు. రహీమ్ వరుసగా రెండు ఫోర్లు బాదడం వల్ల సమీకరణాలు మారాయి. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనూ ధోనీ ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు.
ధోనీ నమ్మకం హార్దిక్ పాండ్య..
పాండ్యతో ధోనీ ఏదో మాట్లాడాడు. తర్వాత చెలరేగిపోయిన పాండ్య రెండు వరుస బంతుల్లో రహీమ్, మహ్మదుల్లాను ఔట్ చేశాడు. భారీ షాట్లు ఆడి మ్యాచ్‌ను త్వరగా ముగించేద్దామనుకున్న బంగ్లా బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని ఎదుర్కోవటంలో విఫలమయ్యారు. ఇక చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ ఉత్కంఠ పెరిగిపోయింది.
బంగ్లా బ్యాట్స్‌మన్ శువగత చివరి బంతిని ఆడలేకపోవడం వల్ల అది నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో సింగిల్ తీసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్దామని భావించిన బంగ్లా ఆశలను ధోనీ చిదిమేశాడు. బై రన్స్ తీద్దామని యత్నించగా ధోనీ నేరుగా వచ్చి వికెట్లను తాకడం వల్ల ముస్తాఫిజుర్ ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.
ఇదీ చూడండి.. ఒలింపిక్స్‌లో పాల్గొనే విషయంపై త్వరలో నిర్ణయం: ఐఓఏ