పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ బౌలర్ డానిష్ కనేరియా విమర్శలు చేశాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారి నిర్ణయాన్ని గౌరవించడంలో పీసీబీ కన్నా భారత క్రికెట్ బోర్డు చాలా మేలని అన్నాడు. పాక్ తరఫున ఆడినందుకు చింతిస్తున్నట్లు చెప్పాడు. తమ దేశ మాజీ ఆటగాడు సమీ అస్లామ్ అమెరికాలో ఆడతానని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేశాడు డానిష్.
"సమీ అస్లామ్ నిలకడైన ఆటగాడు. అతడికి అన్యాయం జరిగింది. షాన్ మసూద్, ఇమాన్ ఉల్ హక్ లాంటి ఆటగాళ్లలా తనకు అవకాశాలు రాలేదు. కేవలం 13 టెస్టులు, నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. పీసీబీ అతడి పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరం. ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతడికి న్యూజిలాండ్ తరఫున ఆహ్వానం లభించింది. మరోవైపు బీసీసీఐ.. జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. అలాంటప్పుడు సూర్య తమ దేశాన్ని విడిచి ఎందుకు వెళ్తాడు?"
-డానిష్ కనేరియా, పాక్ మాజీ క్రికెటర్
రెండు దేశాల జట్లు.. వాళ్లతో కలిసి ఆడేందుకు తనను అహ్వానించాయని డానిష్ కనేరియా చెప్పాడు. కానీ తాను స్వదేశం తరఫున ఆడేందుకే మొగ్గు చూపినట్లు వెల్లడించాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో తనపై జీవిత కాల నిషేధం విధించినప్పుడు.. ఏ ఒక్క సీనియర్ ఆటగాడు కూడా మద్దతుగా నిలువలేదని అన్నాడు. పాక్ తరఫున 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టాడు కనేరియా. 18 వన్డేలాడి 15 వికెట్లు తీశాడు.