బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనా సౌరభ్ గంగూలీ.. తన బృందంతో కలిసి డిసెంబర్ 1న తొలి వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) ఏర్పాటు చేయనున్నాడు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర క్రికెట్ సంఘాలతో పలు అంశాలపై చర్చించనున్నాడు. ఇప్పటికే దీనిపై అన్ని రాష్ర క్రికెట్ బోర్డులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఎన్నికలు జరిగే ముందు మాట్లాడిన పాలకమండలి(సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్.. " అక్టోబర్ 23న సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అనంతరం బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం 21 రోజుల్లోగా గంగూలీ వార్షిక సమావేశం నిర్వహించాలి" అని చెప్పారు.
విరుద్ధ ప్రయోజనాల అంశంపైనా చర్చ..!
గత మూడేళ్లలో తొలిసారి సమావేశం కానున్న ఏజీఎమ్‌లో... సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా సవరించిన రాజ్యాంగంపై చర్చ జరిగే అవకాశముంది. ఇందులో ముఖ్యంగా 70 ఏళ్ల వయసు నిబంధన, ఆరేళ్ల పదవి తర్వాత మూడేళ్ల కూలింగ్ పీరియడ్ కచ్చితంగా ఇవ్వాలన్న నిర్ణయం తొలగించే విషయంపై ప్రధానంగా మాట్లాడుకోనున్నారు. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులపైనా సభ్యులు చర్చించనున్నారు. కొన్ని నిబంధనలను సడలించే అంశంపై బీసీసీఐ సుప్రీం కోర్టు అప్పీల్‌కు వెళ్లనుందని సమాచారం. ముఖ్యంగా మాజీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందిగా మారిన విరుద్ధ ప్రయోజనాల అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.