వాళ్లంతా బ్యాట్ పట్టుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. మైదానంలోని ప్రత్యర్థి ఎంతటి వాడైనా సరే వణుకు పుట్టించగలరు. వేగవంతమైన బంతులనైనా దీటుగా ఎదుర్కోగల ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు. ఆయా దేశాల తరఫున రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ.. టాప్ క్రికెటర్లుగా ముద్ర గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అలాంటి ఆటగాళ్లకూ కొందరు బౌలర్లతో ఇబ్బందులు ఉన్నాయట. వారిని ఎదుర్కోవడం కాస్త కఠినంగా ఉంటుందట. అందుకే వారితో మ్యాచ్ ఉన్న సమయంలో ఎక్కువగా సాధన చేస్తారట. మరి ఈ జాబితాలో కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లూ ఉండటం విశేషం. ఓసారి ఆయా ఆటగాళ్లకు చెక్ పెట్టే బౌలర్లు ఎవరో చూద్దామా?
8.క్వింటన్ డికాక్
మైదానంలో డైనమైట్లా ఉండే ఈ బ్యాట్స్‌మన్.. నిలకడైన ప్రదర్శనకు కేరాఫ్ అడ్రస్. నెమ్మదిగా ఆడగలడు. రన్‌రేట్ ఎక్కువగా ఉన్న సమయంలో గేరు కూడా మార్చగలడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ ముంబయి ఇండియన్స్ తరఫున అదరగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్లోనూ డికాక్‌కు మంచి రికార్డు ఉంది. దక్షిణాఫ్రికా తరఫున ఆడే ఇతడు.. ఇప్పటివరకు 5 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి. సగటు 44.65గా ఉంది. టీ20ల్లో స్ట్రైక్ రేటు దాదాపు 140గా కొనసాగుతోంది. మరి ఇంత విధ్వంసం సృష్టించగలిగే ఈ ఆటగాడికి.. ఓ బౌలర్‌తో చిక్కులు ఉన్నాయట. అతడెవరో కాదు శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ. ఇతడి బౌలింగ్ ఎదుర్కోవడం కాస్త కష్టమని ఓసారి చెప్పాడు. మలింగ యార్కర్లు తనతో పాటు ఇతర బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బందిపెడతాయని పేర్కొన్నాడు. ఇప్పటికే మలింగ వన్డేల్లో 338 వికెట్లు సాధించాడు. టీ20ల్లో 107 వికెట్లు తీశాడు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_dekock23.jpg)
7.జో రూట్
ఇంగ్లాండ్ జట్టుకు వెన్నెముకలా ఉన్న ఆటగాడు జో రూట్. ఇప్పటికే టెస్టుల్లో 8వేల పరుగులు సాధించిన ఈ సీనియర్.. వన్డేల్లోనూ తన దేశం తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 30 అంతర్జాతీయ సెంచరీలు ఇతడి ఖాతాలో ఉన్నాయి. నిలకడకు మారుపేరైన రూట్‌కు ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ బౌలింగ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందట. అందుకేనేమో కమిన్స్ బౌలింగ్‌లో 7 సార్లు ఔటయ్యాడు. ఇక లయన్, హేజెల్‌వుడ్ కూడా ఏడేసి సార్లు రూట్‌ను ఔట్ చేశారు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_root.jpg)
6.బాబర్ అజమ్
యువ ఆటగాళ్లలో తమదైన ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్న ఆటగాడు బాబర్ అజామ్. ఈ పాకిస్థాన్ క్రికెటర్.. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్‌ను అలవోక మారుస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకే టీ20ల్లో వేగంగా వేయి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 50 సగటుతో కొనసాగుతున్నాడు. ఇతడు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల జాబితా ఎక్కువగానే ఉంది. మిచెల్ స్టార్క్, జోష్ హేజెల్‌వుడ్, పాట్ కమిన్స్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బందిపడతానని అతడే స్వయంగా గతంలో వెల్లడించాడు. వీరందరూ గంటకు 140 కి.మీ వేగంతో అలవోకగా బంతులు వేయగలరు. ఇందులో స్టార్క్ 450 వికెట్లు తీశాడు. బౌల్ట్ టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున 250 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కమిన్స్ ప్రస్తుతం ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_babar.jpg)
5.డేవిడ్ వార్నర్
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరఫున 15 వేల పరుగులు సాధించాడు డేవిడ్ వార్నర్. ఎలాంటి ప్రత్యర్థులనైనా దీటుగా ఎదుర్కోగలడు. మంచి ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపించాడు. టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ ఆసీస్ ఆటగాడు.. వన్డేల్లో పాంటింగ్ తర్వాత ఎక్కువ శతకాలు సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. మరి ఇంతగా రాణిస్తున్న ఇతడికీ కొందరు బౌలర్లతో చిక్కులున్నాయట. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టమని వార్నర్ చెప్పాడు. స్టెయిన్-మోర్కెల్ జోడీ టెస్టు క్రికెట్లో దాదాపు 700 వికెట్లు తీసింది. 10 ఏళ్ల పాటు సఫారీ జట్టు బౌలింగ్‌ను ఈ ఇద్దరు యోధులు భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లారు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_warner.jpg)
4.కేన్ విలియమ్సన్
నిలకడైన బ్యాటింగ్, నెమ్మదైన వ్యక్తిత్వంతో అందరికీ ఇష్టమైన బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున అదరగొట్టాడు. న్యూజిలాండ్‌కు ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఇతడూ ఒకరు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 14వేల పరుగులు చేశాడు. 50 సగటుతో తమ దేశ జట్టులో కెప్టెన్‌గా, కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో కివీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గానూ గుర్తింపు పొందాడు. సుదీర్ఘ ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున ఎక్కువ సెంచరీలూ ఇతడి పేరిటే ఉన్నాయి. అయితే ఇలాంటి బ్యాట్స్‌మన్‌కు ఓ బౌలర్ అంటే కాస్త భయం ఉంది. అతడే దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్. గతంలో తన వేగవంతమైన బౌలింగ్‌తో కేన్ గార్డును స్టెయిన్ బ్రేక్ చేశాడట. అప్పట్నుంచి స్టెయిన్ బౌలింగ్ అంటే కాస్త జాగ్రత్తపడతాడట. ఈ విషయాన్ని విలియమ్సన్ స్వయంగా వెల్లడించాడు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_kane.jpg)
3.స్టీవ్ స్మిత్
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు ఆసీస్ ప్రముఖ ఆటగాడు స్టీవ్ స్మిత్. ఇప్పటికే టెస్టుల్లో 7వేల పరుగులు చేశాడు. మొత్తం 26 సెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి. టెస్టు రన్ మెషీన్ అయిన స్మిత్.. తనకు రవీంద్ర జడేజా బౌలింగ్ అంటే కొంచెం కష్టమని పేర్కొన్నాడు. ఉపఖండం పిచ్‌లలో జడేజా అద్భుతంగా రాణిస్తాడని అన్నాడు. విభిన్న వేరియేషన్లు మారుస్తూ.. ఒకే లెంగ్త్‌లో బంతులు వేయడం జడేజాకే సాధ్యమని చెప్పాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌లో తలపడనున్నారు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_steve.jpeg)
2.రోహిత్ శర్మ
ఆధునిక క్రికెట్లో హిట్‌మ్యాన్‌గా, సిక్సర్ల వీరుడిగా రోహిత్‌శర్మకు మంచి పేరుంది. ఎలాంటి బంతినైనా అలవోకగా బౌండరీకి తరలించగల సమర్థుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే పరుగులు సాధించడంలో దిట్ట. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, మూడు ద్విశతకాలు లాంటి రికార్డులు రోహిత్‌కే సాధ్యమయ్యాయి. ఇప్పటివరకు వన్డేల్లో 29 శతకాలు నమోదు చేశాడు. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్‌కు బ్రెట్ లీ, స్టెయిన్ బౌలింగ్ అంటే కాస్త కష్టమట. ఈ విషయాన్ని రోహిత్ గతంలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఐదోసారి ముంబయి జట్టుకు ట్రోఫీ అందించిన ఈ సారథి.. గాయం కారణంగా త్వరలో ప్రారంభం కానున్న భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లకు దూరమయ్యాడు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_rohit.jpg)
1.విరాట్ కోహ్లీ
పరుగులు వీరుడు.. వన్డే క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న బ్యాట్స్‌మన్ ఇతడు. ఇప్పటివరకు టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు చేశాడు. మొత్తంగా కెరీర్లో 70 అంతర్జాతీయ శతకాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రత్యర్థినైనా ఎదుర్కోగల బ్యాటింగ్ టెక్నిక్ ఇతడి సొంతం. అందుకే మూడు ఫార్మాట్లలో ఇతడు అలవోకగా పరుగుల వరద పారిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో 50 సగటు ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరి ఎందరో కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్న విరాట్.. తనకు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ బౌలింగ్ ఎదుర్కొన్నప్పుడు కాస్త కష్టంగా అనిపించినట్లు చెప్పాడు. ప్రపంచ టాప్-3 కఠినమైన బౌలర్లలో ఆమిర్ కచ్చితంగా ఒకడని విరాట్ ప్రశంసించాడు.
![top batsmen in world class cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9674115_virat.jpg)