ఐపీఎల్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌ల్లో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉంటారని చెన్నైసూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ చెప్పాడు. అలాంటి వారిలో చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ ఒకరని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆటగాడు.. చాలా ఏళ్లుగా సీఎస్కేకు ఆడుతున్నాడు. ఇటీవలే జింబాబ్వే మాజీ పేసర్ ఫొమ్మీ ఎంబంగ్వాతో మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నాడు.
"చెన్నైతో నా అనుభవం ఎక్కువగా ఆ ప్రశాంతమైన డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉంది. అక్కడ చాలామంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉన్నారు. సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే ఏదో తెలియని ధైర్యం. ప్రతి సందర్భంలోనూ.. కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఆటను గెలవడంలో అక్కడి వారంతా అనుభవాలను పంచుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల మనపై మనకు ఎంతో నమ్మకం ఏర్పడుతుంది"
డుప్లెసిస్, దక్షిణాఫ్రికా క్రికెటర్
ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2010, 2011లో విజేతగా నిలవడం సహా రెండేళ్ల నిషేధం నుంచి మళ్లీ తిరిగొచ్చిన ఈ జట్టు.. 2018లో ట్రోఫీని సొంతం చేసుకుంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మార్చిలో ప్రారంభం కావాలి. అయితే కరోనా ప్రభావం వల్ల దానిని నిరవధిక వాయిదా వేశారు. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే అదే సమయంలో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.