టెస్టు క్రికెట్‌కు జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. ఓ ఆటగాడి అసలు సిసలు ప్రతిభ ఈ ఫార్మాట్ ద్వారానే బయట పడుతుంది. టాపార్డర్ విఫలమైన సమయంలో మిడిలార్డర్ జట్టును ఆదుకునే బాధ్యత తీసుకుంటుంది. కొన్నిసార్లు టెయిలెండర్లూ పట్టుదలగా ఆడి మ్యాచ్‌ను మలుపుతిప్పిన సందర్భాలున్నాయి. అయితే కొందరు టెయిలెండర్లు మాత్రం టెస్టుల్లో ఎక్కువసార్లు డకౌట్ అయి ఓ చెత్త రికార్డునూ మూటగట్టుకున్నారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.
కోర్ట్నీ వాల్ష్ - వెస్టిండీస్ (43 డక్స్)
కోర్ట్నీ వాల్ష్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ పేసర్లలో ఒకరు. వాల్ష్ చేతిలో బంతి ఉందంటే బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకుపుట్టడం సహజమే. అలాంటి బౌలర్ బ్యాట్ పడితే మాత్రం తడబడతాడు. 132 టెస్టు మ్యాచ్‌లాడిన వాల్ష్ ఏకంగా 43 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్నిసార్లు డకౌట్ అవడం టెస్టు క్రికెట్లో ఓ రికార్డు. ఇందులో నాలుగు సార్లు ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగులకే పెవిలియడం చేరడం గమనార్హం. 1984-2001 వరకు మొత్తం 17 ఏళ్ల టెస్టు కెరీర్లో 936 పరుగులు మాత్రమే సాధించాడితడు. ఇందులో 61 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు.
క్రిస్ మార్టిన్ - న్యూజిలాండ్ (36 డక్స్)
న్యూజిలాండ్ పేసర్ క్రిస్ మార్టిన్ మొత్తం 13 ఏళ్లు టెస్టు జెర్సీ ధరించాడు. కివీస్ బౌలింగ్ యూనిట్‌కు దన్నుగా నిలబడ్డాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లతో సత్తాచాటాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం కాస్త తడబడ్డాడు. తన టెస్టు కెరీర్లో 36 సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఇందులో 7 సార్లు ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇతడి టెస్టు కెరీర్లో మొత్తం 615 బంతులు ఎదుర్కొని 123 పరుగులు మాత్రమే సాధించాడు.
గ్లెన్ మెక్‌గ్రాత్ - ఆస్ట్రేలియా (35 డక్స్)
ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌కు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడమంటే మహా సరదా. కానీ బ్యాటింగ్ చేయమంటే మాత్రం ఆసక్తి చూపేవాడు కాదట. చివరి బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చినా ఎక్కువసేపు ఉండేవాడు కాదు. మొత్తం ఇతడి 14 ఏళ్ల టెస్టు కెరీర్లో 35 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇందులో మూడు సార్లు ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే పరిమితమయ్యాడు.
స్టువర్ట్ బ్రాడ్ - ఇంగ్లాండ్ (35)
ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తాడు. ఇతడి ఖాతాలో 12 అర్ధసెంచరీలు, ఒక శతకం కూడా ఉన్నాయి. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకుని ఆల్‌రౌండర్‌గా నిలవాలన్నది బ్రాడ్ కల. అందుకు తగ్గట్టుగానే మంచి ప్రదర్శన కూడా చేస్తున్నాడు. అయితే డకౌట్లలోనూ ముందున్నాడు. మొత్తం 138 మ్యాచ్‌ల్లో 35 సార్లు డకౌటయ్యాడు. ఇతడు కెరీర్లో మొత్తం 3,211 పరుగులు చేశాడు. 169 అత్యధిక స్కోర్.
షేన్ వార్న్ - ఆస్ట్రేలియా (34 డక్స్)
ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బౌలింగ్ మాయాజలంతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టిన వార్న్ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం వార్న్ కాస్త ఇబ్బందిపడేవాడు. మొత్తంగా కెరీర్లో 34 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.