కరోనా కారణంగా క్రికెట్ సిరీస్‌లు అన్నీ వాయిదా పడ్డాయి. అవి మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. వైరస్‌ను సమూలంగా నాశనం చేసిన తర్వాతే క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని అభిప్రాయపడ్డాడు.
"కరోనా నుంచి ముందుగా మన దేశాల్ని, ప్రపంచాన్ని కాపాడుకోవాలి. మహమ్మారిని సమూలంగా నిర్మూలన చేయాలి లేదా 90-95 శాతం వరకు తగ్గించాలి. ఎందుకంటే ఇది పెరిగే కొద్ది ఆటగాళ్లు బయటకు రావడానికి, మైదానాలకు వెళ్లడానికి, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటానికి భయపడతారు. దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎంతో ఒత్తిడి ఉంటుంది. దానికి తోడుగా కరోనా భయం ఉండకూడదు."
-యువరాజ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
"మీరు బ్యాటింగ్ చేసే సమయంలో గ్లోవ్స్ ధరిస్తారు. దీంతో చెమట వస్తుంటుంది. మీకు అరటిపండ్లు తినాలనిపిస్తుంటుంది. కానీ ఇతర ఆటగాళ్లు దాన్ని తీసుకువస్తారు. దీంతో అరటిపండు కూడా తినకూడదని భావిస్తారు. మీ మదిలో ఇలాంటి ఆలోచనలు రాకూడదు. బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపైనే దృష్టి సారించాలి. అందుకే కరోనా అంతమొందించిన తర్వాతే ఆటను తిరిగి ఆరంభించాలి" అని యువీ తెలిపాడు.
కరోనా కారణంగా ఒలింపిక్స్‌తో సహా అన్ని క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే ఖాళీ స్టేడియాల్లో క్రీడలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.