ఐపీఎల్లో ఆడనున్న తమ దేశ క్రికెటర్లకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా పలు నిబంధనలు విధించింది. బెట్టింగ్, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్, టోబాకో వంటి బ్రాండ్ల ప్రకటనలలో వారు ఉండకూడదని స్పష్టం చేసింది.
ఏప్రిల్ రెండో వారం నుంచి ఐపీఎల్ 14వ సీజన్ జరుగనుంది. ఇందులో కొంతమంది ఆసీస్ ఆటగాళ్లు ఆడనున్నారు. మాక్స్వెల్, జే రిచర్డ్సన్ వంటి ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడయ్యారు.
"సంబంధిత ఐపీఎల్ టీమ్ స్పాన్సర్లు ఇచ్చిన టీమ్ ఫొటోలను మాత్రమే భారత ప్రింట్ మీడియా ఉపయోగించాలి. వాటిలోనూ.. బెట్టింగ్, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్, టోబాకో వంటి బ్రాండ్ల పేర్లు ఉండకూడదు" అని క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధన పెట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు స్పష్టం చేసింది.
వీటితో పాటు..
- ఏ ఆస్ట్రేలియా ఆటగాడు, ప్రత్యేకంగా ఏ యాడ్లోనూ ఉండకూడదు. ఏ ఆసీస్ ప్లేయర్ ఫోటోను టీవీ, రేడియో, మీడియా, అంతర్జాలం, పాయింట్ ఆఫ్ సేల్‌ల వద్ద ప్రదర్శించకూడదు.
- ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఒకరి కంటే ఎక్కువ ఆటగాళ్లను.. ఫ్రాంచైజీలు యాడ్లలో వాడుకోకూడదు.
- ఆస్ట్రేలియాలోని ఒకే రాష్ట్రానికి చెందిన ఒకరి కంటే ఎక్కువ ఆటగాళ్లను.. ఫ్రాంచైజీలు యాడ్ల కోసం వాడుకోకూడదు.
- బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్న ఒకరి కంటే ఎక్కువ ఆటగాళ్లను.. ఫ్రాంచైజీలు యాడ్ల కోసం వాడుకోకూడదు.
ఐపీఎల్లో ఆడనున్న ఆసీస్ క్రికెటర్లు..
14వ సీజన్ ఐపీఎల్లో ఆస్ట్రేలియా నుంచి 19 మంది ఆటగాళ్లు ఆడనున్నారు. స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, నాథన్ కౌల్టర్ నైల్, రిచర్డ్సన్, రిలే మెరిడిత్, బెన్ కటింగ్, హెన్రిక్స్, డాన్ క్రిస్టియన్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ స్టాయినిస్, ప్యాట్ కమిన్స్, క్రిస్ లిన్, ఆడమ్ జంపా, డానియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, జోష్ ఫిలిప్, ఆండ్రూ టై, డేవిడ్ వార్నర్,మిచెల్ మార్ష్.
ఇదీ చదవండి: శ్రీలంక బౌలింగ్ కోచ్ పదవికి వాస్ రాజీనామా