కరోనా కారణంగా లభించిన ఈ విరామం భారత మహిళల క్రికెట్ ఎదుగుదలను కనీసం రెండేళ్లు వెనక్కి లాగిందని అమ్మాయిల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఇటీవలే ఓ వెబినార్‌లో మాట్లాడిన ఆమె.. తన అభిప్రాయాలను పంచుకుంది.
''కరోనా మహమ్మారి వల్ల దురదృష్టవశాత్తు మహిళల క్రికెట్ రెండేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు అద్భుత ప్రదర్శన తాలూకు ప్రభావం మరుగున పడిపోయింది. ఏదేమైనా మహిళల జట్టు కోసం క్యాలెండర్ రూపొందించాలని బీసీసీఐతో చర్చించాం. అలాగైనా అభిమానులు జట్టు ఆడే మ్యాచ్‌లను అనుసరించే వీలుంది. వైరస్ కారణంగా ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. వాటిని తిరిగి రూపొందించుకుంటామనే నమ్మకం ఉంది. పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్ జరగాలంటే మరో రెండు, మూడేళ్లు పడుతుందని అనుకుంటున్నా. వచ్చే ఐపీఎల్ సీజన్‌తో పాటు నిర్వహించాల్సిన మహిళల ఛాలెంజ్ టోర్నీలో పాల్గొనేందుకు నాలుగో జట్టు కోసం చూస్తున్నాం.''
- మిథాలీరాజ్, టీమిండియా మహిళల వన్డే జట్టు కెప్టెన్
వ్యాపార సంస్థలు కనీసం ఒక్క భారత క్రీడనైనా దత్తత తీసుకోవాలని, ప్రసారదార్లు వాటికి ప్రచారం కల్పించేందుకు సమయం కేటాయించాలని.. ఇదే వెబినార్‌లో మాట్లాడిన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:'మహిళా ఐపీఎల్‌ను బీసీసీఐ వచ్చే ఏడాది ప్రారంభించాలి'