బీసీసీఐకి కరోనా వైరస్ విచిత్రమైన పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇప్పటికే కొవిడ్-19 ముప్పుతో ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్ మ్యాచులన్నీ వాయిదా వేసింది. తాజాగా ముంబయిలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులందరినీ మంగళవారం నుంచి ఇంటివద్ద నుంచే పని చేయాలని ఆదేశించింది.
"కొవిడ్-19 మహమ్మారి వల్ల వాంఖడే స్టేడియం వద్దనున్న ప్రధాన కార్యాలయం మూసివేస్తున్నామని ఉద్యోగులందరికీ తెలిపాం. మంగళవారం నుంచి అందరూ ఇంటివద్ద నుంచే పనిచేయాలని ఆదేశించాం."
-బీసీసీఐ.
కరోనాను కట్టడి చేసేందుకు జనసమ్మర్థం లేకుండా చూడాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. అంతర్జాతీయ, దేశవాళీ సిరీసులను రద్దు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ముంబయిలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు 114 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : ప్రపంచాన్ని ఇలా చూడటం కష్టంగా ఉంది: రోహిత్