భారత్‌లో ఇప్పటి వరకూ 45 మందికి కరోనా సోకింది. దీని వల్ల భారత పర్యటనలో కోహ్లీసేనతో సహా ఎవరితోనూ కరచాలనం చేయకపోవచ్చని దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు. మూడు వన్డేల సిరీస్ కోసం సఫారీలు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరే ముందు.. 'ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా?' అన్న ప్రశ్నకు స్పందించాడు బౌచర్.
"కరచాలనం చేయాలా వద్దా ఆలోచనలో మేము ఉన్నాం. వైరస్ మా కుర్రాళ్లకు సోకకుండా ఉండేందుకు అలా చేయకపోవడమే మేలైతే మానేస్తాం. మాకు భద్రతా సిబ్బంది ఉన్నారు. వైద్యపరంగా ఏమైనా అవసరం ఉంటే వారికి తెలియజేస్తాం. వారు సూచనలు చేస్తారు. మరీ ప్రమాదకరంగా ఉంటే వారే మమ్మల్ని వెళ్లొద్దంటారు. గత రాత్రి వైద్యసిబ్బంది మాకు వైరస్ గురించి పూర్తిగా వివరించారు. మేం వాళ్ల సూచనలు పాటిస్తాం. సిబ్బంది సరైన సహాయం చేస్తారని మాకు నమ్మకముంది."
- బౌచర్, దక్షిణాఫ్రికా కోచ్.
భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది దక్షిణాఫ్రికా. ఈనెల 12న ప్రారంభం కానున్న ఈ సిరీస్లో పాల్గొనేందుకు 16 మందితో కూడిన సఫారీ జట్టు.. తాజాగా దిల్లీ చేరుకుంది. ధర్మశాల వేదికగా జరగబోయే తొలి వన్డే కోసం ఇరుజట్లు.. (మంగళవారం) అక్కడికి వెళ్లనున్నాయి.
ఇదీ చూడండి.. వన్డే సిరీస్ కోసం భారత్ చేరుకున్న సఫారీలు