బంగ్లాదేశ్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ మధ్య జరగాల్సిన టీ20లు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ప్రభావమే ఇందుకు కారణమని బంగ్లాదేశ్ క్రికెట్ సంఘం (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ చెప్పారు. నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అన్నాడు. బహుశా.. కరోనా వల్ల వాయిదాపడ్డ తొలి క్రికెట్ టోర్నీ ఇదే కావొచ్చని తెలుస్తోంది.
బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ శత జయంతిని పురస్కరించుకొని ఈనెల 21, 22న ఆసియా, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. భారీ స్థాయిలో వీటిని నిర్వహించాలని బీసీబీ నిర్ణయించింది. ఇందుకోసం ఆటగాళ్లను పంపించాలని ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు లేఖలు రాసింది. విరాట్ కోహ్లీ సహా నలుగురు క్రికెటర్లను ఆసియా XI జట్టులో ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐని కోరింది. మ్యాచ్‌ల కన్నా ముందు ఏఆర్ రెహమాన్‌తో సంగీత విభావరి ఏర్పాటుకు నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా వీటిని వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
" ఈ నెల 18న సంగీత విభావరి ఏర్పాటు చేయాలనుకున్నాం. సాధారణంగా అనుకొని తర్వాత భారీ స్థాయిలో జరపాలని నిర్ణయించాం. అదిప్పుడు 18న జరగడం లేదు. 21, 22న మ్యాచ్‌ల నిర్వహణకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటగాళ్లు వస్తారనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు మేం సంగీత విభావరి, మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నాం. రెండు మూడు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకుంటున్నాం"
-- నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆదివారం.. మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరిని నిర్బంధించినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. మనదేశంలోనూ 65మందికి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వచ్చినా... కేంద్రం మాత్రం అధికారికంగా 60 మంది మాత్రమే బాధితులని వెల్లడించింది.
ఇదీ చదవండి...