భారత సీనియర్ ఆటగాళ్లు ధావన్, భువనేశ్వర్ కుమార్‌లను ఏ ప్లస్ కేటగిరీ నుంచి తొలగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఫలితంగా వీరికి అందజేసే వార్షిక ఆదాయం తగ్గనుంది. యువ క్రీడాకారుడు పంత్ ఏ కేటగిరిలో స్థానం సంపాదించాడు. అత్యధిక ఆదాయం వచ్చే ఏ ప్లస్ విభాగంలో ప్రస్తుతం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు.
- ఇటీవల ధావన్, భువీ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ వీరి స్థాయి తగ్గించింది. ఏ కేటగిరీలోకి మారుస్తూ గురువారం నిర్ణయం వెల్లడించింది. దీని వల్ల వీరి వార్షిక జీతం రూ. 7కోట్ల నుంచి ఐదు కోట్లకు పడిపోనుంది.
ముగ్గురు మొనగాళ్లు:
ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో భారత సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మాత్రమే ఉన్నారు.
పంత్ పై పైకి...
యువ ఆటగాడు రిషబ్ పంత్... ఈ ఏడాది కాంట్రాక్టులో ఏ కేటగిరీని సొంతం చేసుకున్నాడు. ఐదు కోట్ల వార్షిక ఆదాయం లభించనుంది. ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికితే ఇతడే కీలకమయ్యే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో మెరుగైన ఆటతీరుతో మెప్పించాడు పంత్.
ఏ కేటగిరీలో మరికొందరు:
ఈ విభాగంలో ధోని, ధావన్, భువనేశ్వర్, షమి, అశ్విన్, ఇషాంత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్, పుజారా, రహానే ఉన్నారు.
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ బీ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి అప్‌గ్రేడ్ అయ్యాడు. ఆసీస్ టూర్లో విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్‌ని పూర్తిగా ఈ జాబితా నుంచి తొలగించారు.
- పుజారా టెస్టు ఫార్మాట్లో మాత్రమే ఆడుతూ ఏ కేటగిరీలో కొనసాగుతున్నాడు.
బీ కేటగిరీలో...
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ బీ కేటగిరీలో ఉన్నారు. వీరికి 3 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తుంది. వీరితో పాటు చాహల్, ఉమేశ్ ఇదే విభాగంలో ఉన్నారు.
కేట'గిరి' గీసి...
సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ సూచనల మేరకు భారత సీనియర్ జట్టులో ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలు ఉంటాయి. ఈ విభాగాల ఆధారంగానే క్రీడాకారులకు చెల్లింపులు చేస్తున్నారు.
ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు, కేటగిరీ-ఏ క్రీడాకారులకు రూ. 5 కోట్ల వేతనం అందిస్తారు. బీ-కేటగిరీలో ప్లేయర్లకు రూ.3 కోట్లు, సీ- కేటగిరీలో ఉన్న వారికి రూ.1 కోటి చొప్పున చెల్లిస్తున్నారు.
మహిళలకు...
ఏ-గ్రేడ్ మహిళా ప్లేయర్లకు రూ. 50 లక్షలు, బీ-గ్రేడ్‌లో ఉన్న వారికి రూ.30 లక్షలు, సీ-గ్రేడ్ ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం అందిస్తున్నారు.