క్రికెట్లో ఒక రికార్డును ఎవరైనా నెలకొల్పితే..ఆ రికార్డును మరొకరు బ్రేక్ చేస్తుంటారు. ఈ విధంగా పోటీ కొనసాగుతూనే ఉంటుంది. అయితే పురుషుల క్రికెట్లో పోల్చితే మహిళా క్రికెట్లో కాంపిటీషన్ కాస్త తక్కువ. కానీ కొందరు మహిళా క్రికెటర్లు సృష్టించిన రికార్డులు మాత్రం పురుష క్రికెటర్లకు సవాల్ విసురుతున్నాయి. వారు కూడా ఛేదించలేని విధంగా ఉన్నాయి. అలాంటి రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అతిపిన్న వయసులో సెంచరీ
ఇంతకుముందు అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. ఇతడు 16 ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 102 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకుంది భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. 16 ఏళ్ల 205 రోజుల వయసులో శతకం చేసి అతిపిన్న వయసులో అంతర్జాతీయ సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించింది. 1999లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ 114 పరుగులు చేసింది. ఈ రికార్డు నెలకొల్పి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా అలాగే ఉండటం విశేషం.
అతిపిన్న వయసులో డబుల్ సెంచరీ
అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేయడమే కష్టంతో కూడుకున్న పని. అలాంటిది డబుల్ సెంచరీ సాధించడం చాలా అరుదు. కానీ ఎపుడైతే సచిన్ తెందూల్కర్ ఈ ఘనత సాధించాడో అప్పటి నుంచి అది కూడా ఓ సాధారణ ఫీట్లా భావిస్తున్నారు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మార్టిన్ గప్తిల్, గేల్ ఇలా వీరంతా డబుల్ సెంచరీలు బాదేశారు.
అయితే అతి పిన్న వయసులో ద్విశతకం సాధించిన రికార్డు మాత్రం ఓ మహిళా క్రికెటర్ పేరు మీదుంది. న్యూజిలాండ్ క్రీడాకారిణి అమెలియా కేర్ 2018లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 145 బంతుల్లో 218 పరగులు చేసింది. ఇందులో 31 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అప్పటికి తన వయసు 17 ఏళ్ల 243 రోజులు మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డు బ్రేక్ చేయడం అంత సులభమేమి కాదు.
అత్యంత ఎక్కువ వయసుగల వన్డే ప్లేయర్
క్రికెట్.. ఓ కాంపిటేటివ్ ఫార్మాట్. జట్టులో కొనసాగాలంటే మంచి ప్రదర్శన తప్పనిసరి. ఫామ్ కోల్పోతే మాత్రం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వేరే ఆటగాళ్లు ఎదురు చూస్తూనే ఉంటారు. అలా ఎంతోమంది ఆటలోని ఒత్తిడి తట్టుకోలేక రిటైర్మెంట్ ప్రకటించినవారు ఉన్నారు. అతి ఎక్కువ వయసులో వన్డే మ్యాచ్ ఆడిన రికార్డు నొలాన్ క్లార్క్ పేరిట ఉండేది. ఇతడు 47 ఏళ్ల 257 రోజుల వయసులోనూ మ్యాచ్ ఆడాడు. కానీ ఈ రికార్డును ఓ మహిళా ప్లేయర్ తిరగరాసింది. వెస్టిండీస్ మహిళా క్రికెటర్ స్టెఫనీ పవర్ ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న అత్యంత పెద్ద వయస్కురాలు. ఈమె వయసు 63 ఏళ్ల 43 రోజులు. స్టెఫనీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఈ వయసులోనూ ఆడుతున్న పురుష క్రికెటర్ ఎవరూ లేకపోవడం విశేషం.
ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువ శాతం పరుగులు సాధించిన క్రికెటర్
క్రికెట్లో పరుగులు సాధించడమనేది చాలా ముఖ్యం. టెస్టుల్లో అయితే బ్యాట్స్‌మెన్‌కు రన్స్ స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అయితే ఓ ఇన్నింగ్స్‌లో జట్టుతో పోల్చినపుడు ఎక్కువ శాతం పరుగులు సాధించిన క్రికెటర్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ రికార్డు కూడా ఓ మహిళా క్రికెటర్ పేరు మీదే ఉంది. ఇంగ్లాండ్ ఓ ఇన్నింగ్స్‌లో జట్టంతా 164 పరుగులకు ఆలౌటైతే.. ఇందులో 112 పరుగులు ఎనిద్ బ్లాక్వెల్ చేసినవే. అంటే జట్టు పరుగుల శాతంలో ఎనిద్ వాటా 68.39 శాతం. ఇప్పటివరకు ఇదే రికార్డు.
ఎక్కువ మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ అయినా తీసిన క్రికెటర్
ఈ రికార్డు టీమ్ఇండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ పేరిట ఉంది. టీ20 ఫార్మాట్లో రాధ వరుసగా 24 మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ అయినా దక్కించుకుంది. ఇప్పటికీ ఈమె క్రికెట్లో ఉండటమే కాకుండా.. వికెట్ టేకింగ్ స్ట్రీక్ కొనసాగుతుండటం వల్ల ఈ రికార్డు మరింత మెరుగవ్వనుంది. ఇంతకుముందు ఈ రికార్డు మెగన్ షట్ (23 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. పురుషుల విభాగంలో ఈ రికార్డు లసిత్ మలింగ (శ్రీలంక), ఇష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉన్నాయి. వీరిద్దరూ వరుసగా 16 మ్యాచ్‌ల్లో వికెట్లు సాధించారు. అయితే రాధా యాదవ్‌కు, వీరిద్దరికి స్పష్టమైన తేడా ఉంది. ఇప్పుడిప్పుడే రాధ రికార్డును చెరిపేసే మగ క్రికెటర్ దరిదాపుల్లో ఎవరూ లేరు.