ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది నిర్వహించనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌డే అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. త్వరలో జరగబోయే ఐసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొననున్న క్రికెట్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కెవిన్ రాబర్ట్స్ ఈ విషయాన్ని అందరిముందు ప్రసావించనున్నారు.
ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో రిజర్వ్‌డే లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. మొదటి సెమీఫైనల్ రద్దవ్వటం వల్ల లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన టీమిండియా తుదిపోరుకు చేరింది. ఈ పరిణామంతో నాకౌట్ దశలో రిజర్వ్‌డే అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.
పురుషుల టీ20 ప్రపంచకప్ ప్రారంభమవ్వటానికి ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉంది. దీంతో ఈ టోర్నీలో రిజర్వ్‌డే కేటాయించాలని ఐసీసీని కోరనుంది ఆసీస్ క్రికెట్ బోర్డు. దీనిపై త్వరలో నిర్వహించే ఐసీసీ సమావేశంలో నిర్ణయించనున్నట్టు ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమావేశంలో కమిటీ అధికారికంగా సంతకం చేస్తుందని వెల్లడించారు. క్రికెట్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కచ్చితంగా కార్యనిర్వాహక కమిటీ ఆమోదం కావాలని అన్నారు.
ఇదీ చూడండి.. ఎడిట్ చేసిన ఫొటోతో అడ్డంగా బుక్కైన పీటర్సన్