దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా వ్యాపిస్తుండటం వల్ల ఆసీస్ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని సిడ్నీకి తరలించనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానం ద్వారా వారిని తీసుకెళ్లే యోచనలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలిసింది. దీని కోసం పకడ్బందీగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల కరోనా ఎక్కువవడం వల్ల ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్ పైన్‌తో సహా కొందరు టెస్టు జట్టు సభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
అయితే, దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో కరోనా తీవ్రత ఉండటం వల్ల భారత్-ఆసీస్ తొలి టెస్టుకు అడ్డంకులు ఏర్పడతాయనే అనుమానాలు మొదలయ్యాయి. కాగా, షెడ్యూల్ ప్రకారమే టెస్టు జరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని, అన్నీ నియంత్రణలోకి వస్తాయన్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు సిడ్నీకి చేరుకున్నారు. 14 రోజుల పాటు నిబంధనలను పాటిస్తూ సాధన మొదలుపెట్టారు. నవంబర్ 27న ప్రారంభమై జనవరి 27న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో.. భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. అయితే, సిడ్నీలో కరోనా తీవ్రత లేకపోవడం వల్ల పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎటువంటి ఇబ్బందులు లేవు. తొలి రెండు వన్డేలు, ఆఖరి రెండు టీ20లు సిడ్నీ వేదికగా, రెండో వన్డే, మొదటి టీ20 మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగనున్నాయి.
ఇదీ చూడండి : భారత్X ఆసీస్ తొలి టెస్టుకు కొవిడ్ ఇబ్బందులు?