ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ తర్వాత పితృత్వ సెలవుల కారణంగా సారథి కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో తర్వాత మ్యాచుల్లో పుజారా వికెట్ తీయడమే తొలి లక్ష్యంగా ఆడినట్లు చెప్పాడు ఆసీస్ పేసర్ కమిన్స్.
"విరాట్ వెళ్లిపోవడం వల్ల జట్టుకు అడ్డుగోడగా నిలబడే పుజారాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడాను. ఎందుకంటే అతడు క్రీజులో ఉంటే మ్యాచు ఫలితం(గెలుపు, ఓటమి, డ్రా) ఎలా ఉంటుందో చెప్పలేం. కొన్నేళ్లుగా జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనను ఎదుర్కొనేటప్పుడు యుద్ధం చేసినట్లు భావిస్తాను. సిడ్నీటెస్టు డ్రాగా ముగియడంలో, గబ్బా టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించి తనదైన మార్క్‌ను సెట్ చేశాడు. అతడిని ఎదుర్కోవడం ఎటువంటి బౌలర్‌కైనా కష్టమే. శరీరానికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా తట్టుకుని అతడు ఆడే విధానం ప్రశంసనీయమైనది" అని కమిన్స్ అన్నాడు.
గబ్బా టెస్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన రిషభ్ పంత్‌ను ప్రశంసించాడు కమిన్స్. అతడు క్లాస్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 2-1తేడాతో టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని సాధించింది.
ఇదీ చూడండి: హజారే ట్రోఫీకి నటరాజన్ దూరం