దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బుధవారం టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో డుప్లెసిస్ ఓ భావోద్వేగపు పోస్ట్ ద్వారా వెల్లడించాడు.
"నా దేశం తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటం ఎంతో గర్వంగా ఉంది. అయితే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొనే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. వచ్చే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. అందుకే పొట్టిఫార్మాట్‌పై దృష్టిసారించాలని భావిస్తున్నా. సాధ్యమైనంత వరకు ఆడుతూ ఉత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా."
- ఫాప్ డుప్లెసిస్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా 2012 నవంబరులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఫాఫ్ డుప్లెసిస్.. చివరిగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆడిన 69 టెస్టుల్లో.. 4 వేలకు పైగా పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 21 అర్ధశతకాలున్నాయి. గతేడాది శ్రీలంకతో జరిగిన సెంచురీయన్ టెస్టులో అత్యధికంగా 199 పరుగులను రాబట్టాడు. 36 టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.