ప్రస్తుతం దేశంలోని అన్ని చిత్రసీమల్లో బయోపిక్‌ల హవానే నడుస్తోంది. ముఖ్యంగా క్రీడా ప్రముఖుల చిత్రాలకు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అందుకే వివిద ఆటల్లోని ప్రముఖుల జీవిత చరిత్రలు వెండితెరపై సినిమా రూపంలో కనువిందు చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి.
ఇప్పటికే క్రికెట్ ప్రముఖులు సచిన్, ధోనీ, అజహర్ వంటి క్రీడాకారుల సినిమాలు ఆకట్టుకున్నాయి. టీమిండియా తొలి ప్రపంచకప్ గెలుచుకున్న నేపథ్యంతో ప్రస్తుతం కపిల్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి '83' టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా భారత మహిళల క్రికెట్‌కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్లు, అందులో తాప్సీ ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది చిత్రబృందం. వీటితో పాటు క్రికెట్‌కు సంబంధించి మరో రెండు చిత్రాల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
హిరాణీ చిత్రమిది...
'మున్నాభాయ్ ఎంబీబీఎస్','లగేరహో మున్నాభాయ్','త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ... రెండు క్రికెట్ సంబంధిత కథలకు ఓకే చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. అందులో ఒకటి భారత్ తరఫున టెస్టుల్లో తొలి శతకం బాదిన 'లాలా అమర్‌నాథ్' బయోపిక్ అని తెలిసింది. తన సహాయకుడు అభిజత్ జోషి రాస్తున్న మరో క్రికెట్ స్క్రిప్ట్‌పైనా పనిచేస్తున్నాడట హిరాణీ. ఈ విషయంపై భారీ నిర్మాణ సంస్థలు ఇప్పటికే ఈ దర్శకుడిని సంప్రదించాయని తెలుస్తోంది.
"రాజ్‌కుమార్ హిరాణీతో క్రికెట్‌కు సంబంధించిన రెండు కథలపై సంప్రదింపులు జరిగాయి. ఒకటి క్రికెటర్ లాలా అమర్‌నాథ్ బయోపిక్. దీన్ని పియూష్ గుప్తా, నీరజ్ సింగ్ రాశారు. మరో క్రికెట్ కథను అభిజత్ రాశారు" అని పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రముఖ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించాడు. రెండు క్రికెట్ కథలతో పాటు ఓ వెబ్ సిరీస్‌పై హిరాణీ పనిచేస్తున్నాడని ఆదర్శ్ తెలిపాడు.
తొలి బ్యాట్స్‌మన్...
భారత క్రికెట్‌లో లాలా అమర్‌నాథ్‌ది ప్రత్యేక స్థానం. టీమిండియా తరఫున టెస్టులో తొలి శతకం చేయడమే కాకుండా 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనకు సారథ్యం వహించాడు. 1933 నుంచి 1953 కాలంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అమర్ నాథ్.. 24 టెస్టులు ఆడి 878 పరుగులు చేశాడు. 184 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 10,426 రన్స్ సాధించాడు. ఇతడు బౌలర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. కెరీర్లో 45 టెస్టు వికెట్లు, 463 ఫస్ట్‌క్లాస్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇతడి ఇద్దరు కుమారులు సురిందర్, మొహిందర్ అమర్‌నాథ్ కూడా క్రికెటర్లే కావడం విశేషం.