లఖ్‌నవూ వేదికగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమి తర్వాత పుంజుకోవాలని చూస్తోంది భారత మహిళల జట్టు. దాదాపు ఏడాది విరామం వచ్చినా ఆటపై పెద్దగా ప్రభావం ఉండదని కెప్టెన్ మిథాలీ రాజ్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పిన మాటలు నిజం కాలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బ్యాటింగ్ పిచ్‌పై మిథాలీ, కౌర్, దీప్తి శర్మ రాణించినప్పటికీ మిగితా బ్యాట్స్‌వుమెన్ విఫలమయ్యారు. జట్టుగా కలిసి ఆడటానికి కొంత సమయం పడుతుందని మ్యాచ్ అనంతరం కౌర్ అంగీకరించింది. చాలామంది తమ షాట్ ఎంపిక పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలిపింది.
బలంగా సఫారీలు..
మరోవైపు సౌతాఫ్రికా జట్టు పూర్తి సన్నద్ధతతో పటిష్ఠంగా కనబడుతోంది. ఇటీవల సొంతగడ్డపై పాకిస్థాన్‌ను ఓడించిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. షాబ్నిమ్ ఇస్మాయిల్ నేతృత్వంలోని పేస్ దళం బలంగా కనబడుతోంది.
బలమైన భారత స్పిన్ కూడా సౌతాఫ్రికా ఓపెనర్లు లిజాల్లే లీ, లారా వోల్వార్డ్ట్ ముందు తేలిపోయింది. అయితే మిథాలీ, పేసర్ జులన్ గోస్వామీ ప్రదర్శన సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే రెండో టెస్టుకు మిథాలీ సేన పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
కొత్తవాళ్లకు అవకాశం!
ఆదివారం తొలిమ్యాచ్‌లో పేసర్ మోనికా పటేల్ అరంగేట్రం చేసింది. వచ్చే ఏడాది ప్రపంచకప్ సన్నద్ధత నేపథ్యంలో రెండో వన్డేలో మరింతమంది కొత్తవాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
జట్లు:
భారత్: మిథాలీ రాజ్(కెప్టెన్), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, పూనమ్ రౌత్, ప్రియా పూనియా, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ (వికెట్ కీపర్), శ్వేతా వర్మ (వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, మాన్సీ జోషి, పూనం యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్.
దక్షిణాఫ్రికా: సునే లూస్ (కెప్టెన్), అయాబోంగా ఖాకా, షాబ్నిమ్ ఇస్మాయిల్, లారా వోల్వార్డ్ట్, త్రిషా చెట్టి (వికెట్ కీపర్), సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), తాస్మిన్ బ్రిట్జ్ (వికెట్ కీపర్), మారిజాన్ కాప్, నోండుమిసో, లిజాల్లే లీ (వికెట్ కీపర్), అన్నే బాష్, ఫయే టన్నిక్‌లైఫ్ (వికెట్ కీపర్), నాన్‌కులూకో మ్లాబా, మిగ్నాన్ డు ప్రీజ్ (వికెట్ కీపర్), నాడిన్ డి క్లర్క్, లారా గూడాల్, తుమి సేఖుఖునే.
ఇదీ చూడండి: పడిక్కల్ సంచలనం- వరుసగా నాలుగో శతకం