టీ20 అంటే అభిమానులకు గుర్తొచ్చేది ఫోర్లు, సిక్సర్లే. బౌలర్ ఎవరైనా బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. ఇలాంటి సమయాల్లో డాట్ బాల్ వేసిన బౌలర్‌ను ప్రత్యేకంగా చూస్తారు. మెయిడిన్ ఓవర్ వేసి మ్యాచ్ విజయావకాశాలను మార్చే ఆటగాళ్లూ ఉన్నారు. తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఘనతలు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వారు నమోదు చేసిన అత్యుత్తమ మెయిడిన్ గణాంకాలు ఇవే.
- ప్రవీణ్ కుమార్.. 14 మెయిడిన్స్
ప్రవీణ్ కుమార్ భారత మాజీ స్వింగ్ బౌలర్. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 14 సార్లు మెయిడిన్స్, 1,075 డాట్ బాల్స్ వేశాడు. 119 మ్యాచ్‌లాడి 90 వికెట్లు తీశాడీ ఈ 32 ఏళ్ల క్రికెటర్.
- ఇర్ఫాన్ పఠాన్..10 మెయిడిన్స్
ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు ఇర్ఫాన్ పఠాన్. గత రెండేళ్లుగా ఇతన్ని కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. లీగ్‌లో ఇప్పటి వరకు 103 మ్యాచ్‌లాడి 80 వికెట్లు తీశాడు. తన ఐపీఎల్ కెరీర్లో అత్యధికంగా 10 మెయిడిన్స్ సాధించి రెండో స్థానంలో ఉన్నాడు..
- లసిత్ మలింగ.. 8 మెయిడిన్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో మలింగ ముందు వరుసలో ఉంటాడు. మొత్తంగా 110 మ్యాచ్‌లాడి 154 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ పేరు సంపాదించాడు. ఐపీఎల్ కెరీర్లో 8 మెయిడిన్స్ వేశాడు.
- సందీప్ శర్మ.. 8 మెయిడిన్స్
25 ఏళ్ల సందీప్ శర్మ పంజాబ్, హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ మొత్తంగా 68 మ్యాచ్‌లాడి 83 వికెట్లు తీశాడు. 8 మెయిడిన్స్ వేసి ఈ పొట్టి లీగ్‌లో ప్రతిభావంతులైన బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు.
- ధావల్ కులకర్ణి..7 మెయిడిన్స్
ముంబయికి చెందిన ధావల్ ఐపీఎల్లో పలు ఫ్రాంఛైజీలకు ఆడాడు. 80 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు. 7 మెయిడిన్స్ వేసి ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.