ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చైనా స్పాన్సర్‌షిప్‌ల అంశంపై.. క్రికెట్, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని బోర్డు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, ఐపీఎల్ సమీక్ష సమావేశానికి ఇంకా తేదీ ఖరారు చేయలేదని స్పష్టం చేశారు.
"ప్రస్తుతానికి ఐపీఎల్ సమీక్ష సమావేశానికి సంబంధించిన తేదీ నిర్ణయించలేదు. బీసీసీఐ ఇతర అంశాలను పరిశీలిస్తోంది. క్రికెట్, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేం నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్‌లోని అన్ని సమస్యలపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ భేటీ జరుగుతుంది"
బీసీసీఐ అధికారిక వర్గాలు
గల్వాన్ లోయ వివాదంలో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో చైనా స్పాన్సర్షిప్ విషయమై చర్చలు మొదలయ్యాయి. చైనా స్పాన్సర్లను ముగింపు పలకాలని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెవాడియా పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే చైన్నై సూపర్ కింగ్స్ సహా ఇతర ఫ్రాంచైజీలు స్పందిస్తూ.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాయి. మరోవైపు చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 మొబైల్ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం నిర్ణయించింది.