సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ తుది దశకు చేరింది. కరోనా ఆంక్షలు పాటిస్తూనే ఈ ట్రోఫీ నిర్వహణ సజావుగా సాగించింది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ). దీంతో విజయ్ హజారే, మహిళల వన్డే, వినూ మన్కడ్ టోర్నీల నిర్వహణపైనా దృష్టి సారించింది బీసీసీఐ. టోర్నీల నిర్వహణపై నిర్ణయాలు, అభిప్రాయాలు తెలియజేయాలంటూ.. రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖలు రాశారు.
" మహిళల క్రికెట్ జరిగేలా చూడటం ముఖ్యమైన అంశం. సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్‌తో సహా విజయ్ హజారే ట్రోఫీని నిర్వహించాలని సంకల్పించాం. దాంతోపాటు అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీని జరపాలని అనుకుంటున్నాం. 2020-21 సీజన్‌కు సంబంధించి మిగిలి ఉన్న దేశవాళీ క్రికెట్ నిర్వహణ అంశంపై మీ నిర్ణయాన్ని తెలుపాల్సిందిగా కోరుతున్నాం."
- జై షా, బీసీసీఐ కార్యదర్శి
బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు ఓ మహిళ క్రికెటర్. ఇది తమకు శుభవార్త అని ఆనందం వ్యక్తం చేసింది. కఠోర సాధన చేస్తున్న తమకు టోర్నీ నిర్వహణ స్ఫూర్తినిచ్చే అంశమని పేర్కొంది. ఐపీఎల్ కంటే ముందే విజయ్ హజారే టోర్నీ నిర్వహించడం శుభ పరిణామమని ఓ క్రికెటర్ తెలిపాడు. ఈ టోర్నీ ప్రదర్శనతో మరికొంత మంది వెలుగులోకి వస్తారని పేర్కొన్నాడు.
కాగా, బీసీసీఐ లేఖకు స్పందించిన చాలా రాష్ట్రాలు 50 ఓవర్ల విజయ్ హజారే టోర్నీకి సుముఖత వ్యక్తం చేశాయి. దీని నిర్వహణ చాలా సులభమని పేర్కొన్నాయి. మహిళల వన్డే, అండర్-19 టోర్నీలు దేశవాళీ ఆటగాళ్లకు మరింత ప్రోత్సాహకంగా ఉంటాయని తెలిపాయి.
ఇదీ చదవండి: అభాగ్య వృద్ధులపై అమానవీయం..!